గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న భాజపా నేతలను.. పోలీసులు అరెస్టులు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా కీలక నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి గుంటూరు, విజయవాడలోని స్టేషన్లకు తరలించారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి.. వాహనాలు తనిఖీలు చేశారు. భాజపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను.. గన్నవరం విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చిన భాజపా నేతలు యామినీ శర్మ సహా ఐదుగురిని స్టేషన్‌కు తరలించారు. దైవదర్శనానికి వచ్చిన వాళ్లనూ అరెస్టు చేయటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని యామినీశర్మ డిమాండ్ చేశారు.
జాతీయ రహదారి మీదుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. వైకాపా అధికార ప్రతినిధిగా డీజీపీ మారారని విమర్శించిన భాజపా కార్యకర్తలు విమర్శించారు. గౌతమ్ సవాంగ్ వెంటనే క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.