2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి హైదరాబాద్‌లో ఐదేళ్లో.. పదేళ్లో ఉండి పాలన చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చారని రాంమాధవ్ అన్నారు. అద్దె ఇళ్లల్లో ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించారని.. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడూ.. కేంద్రం జోక్యం చేసుకోకుండా.. నిర్మాణాలకు 2500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి సహాయం చేసిందన్నారు. గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని.. ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులపై తీసుకునే నిర్ణయంలోనూ పరిమితంగానే కేంద్ర ప్రభుత్వ చొరవ ఉంటుందని తెలిపారు.
"దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కి లక్నో ఒక్కటే రాజధానిగా ఉంది. అక్కడి నుంచి పరిపాలన సజావుగానే జరుగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగిందని.. మూడు రాజధానులు కడతామంటే.. అవినీతిపై ఖచ్చితంగా భాజపా పోరాడుతుంది. ఈ నిర్ణయం మూడింతల అవినీతికి సాధనంగా మారకూడదు. అమరావతి ప్రాంతంలో పోరాటం చేస్తోన్న చిట్టచివరి రైతు వరకు న్యాయం జరిగేందుకు భాజపా ముందుండి పోరాటం చేయాలి. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం ముందు ఉంది. మూడు రాజధానుల విషయంలో ఏ నిర్ణయం వస్తుందనేది చూడాలి. 3 రాజధానులు అవినీతికి పెద్ద ఆలవాలంగా మారకూడదు. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ఇలాంటి అంశాలపై భాజపా రాష్ట్ర శాఖ నిర్మాణాత్మకంగా సంఘర్షణ పూరితంగా పోరాటం చేయాలి."-రాంమాధవ్ ,భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి