వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కొల్లేరులో సందడి చేస్తున్న విహంగాల లెక్కింపు ప్రారంభమైంది. ఏటా నవంబరులో విడిదిగా వచ్చి సంతానోత్పత్తి చేసుకొని మార్చిలో ఈ ప్రాంతం నుంచి పిల్లలతో తరలుతాయి. అనుకూల వాతావరణం కావడంతో 10 శాతం పక్షుల సంఖ్య పెరిగి ఉండవచ్చని పర్యావరణ ప్రేమికులు, సిబ్బంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 7 మండలాల్లో విస్తరించి ఉన్న కొల్లేరులో 72 రకాల మత్స్యసంపద, 189 పక్షిజాతులు ఉన్నాయి. విదేశీ, స్వదేశీ పక్షులకు, వివిధ రకాల మత్స్యసంపదకు నిలయం ఈ కొల్లేరు ప్రాంతం. వన్యప్రాణి విభాగం సిబ్బంది లెక్కింపు నిర్వహించి వాటి వివరాలను నమోదు చేస్తారు. ఈ ఏడాది బుధవారం ప్రారంభమైన లెక్కింపునకు 30 మంది సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో పక్షులను చిత్రీకరించి లెక్కింపు చేపడుతున్నారు. స్థానిక పక్షిజాతులు, విదేశీ పక్షుల వివరాలను పరిశీలించి లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఏటా వచ్చేవి, ఈ ఏడాది కొత్తగా వచ్చేవాటి వివరాలను సేకరించి పొందుపరుస్తున్నారు.