Bhogi celebrations: రాష్ట్రవ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి కుటుంబ సభ్యులతో సందడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో భోగి వేడుకలు జరుపుకున్నారు. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భోగి పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలమూరు మండలం గుమ్మిలేరులో కిలోమీటర్ పొడవైన భోగి దండను తయారు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచే భోగి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో గ్రామ దీప్ ఫౌండేషన్, ఏలూరు జిల్లా జీవవైవిధ్య యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సముదాయంలో న్యాయవాదులు సంప్రదాయపద్ధతిలో పండుగ నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సహాలతో వేకువజాము నుంచే భోగి మంటల దగ్గర సందడి చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా గంగిరెద్దులు, హరిదాసుల ఆటపాటలతో భోగి పండగ నిర్వహించారు.
రాష్ట్రమంతా అంబరాన్ని అంటిన భోగి సంబరాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెంలో.. అయిదుగురు మహిళలు పది గంటలు కష్టపడి అతిపెద్ద ముగ్గు వేశారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ పటమటలో భోగిమంటల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దోస్త్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో భోగి మంటల జాతర ఉత్సాహంగా సాగింది. బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.విజయ్‌కృష్ణన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అద్దంకిలో భోగి మంటలు వేసే సమయంలో యువకులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
తిరుమలలో భోగి పండుగ సంబరాలు అంబరాన్నితాకాయి. శ్రీవారి ఆలయం ప్రాంగణంలో ఉద్యోగులు, స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్‌బాబు వర్సిటీలో భోగి వేడుకులు నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రాంభమయ్యాయి.
ఇవీ చదవండి: