ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ రెండో రోజుకు చేరుకున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైన విజయ దశమి నుంచి ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి ఎక్కువైంది. దీక్షలు విరమించేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు తరలివస్తున్నారు. కాలినడకన, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి వచ్చే భవానీలు ముందుగా శనేశ్వరాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఆలయం వెనుకవైపున ఉన్న కృష్ణవేణి ఘాట్‌లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని...ఈ ఘాట్‌కు ఎదురుగా కేశఖండన శాలల సంఖ్యను పెంచారు.
స్నానాలు ఆచరించిన భవానీలు...అక్కడి నుంచి వినాయకుడి ఆలయం, కంట్రోల్ రూం వద్ద నుంచి క్యూలైన్లలోకి ప్రవేశిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా 300, 100, ఉచిత దర్శనం లైన్లు ఏర్పాటు చేసినా.....భవానీలను అన్ని లైన్లలో ఉచితంగానే దర్శనానికి అనుమతిస్తున్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి కిందికి దిగిన భవానీలు మహామంటపం ఎదురుగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇరుముళ్లు సమర్పిస్తున్నారు. కనకదుర్గా నగర్ ప్రారంభంలో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్ల వద్ద....భక్తులు బారులు తీరుతున్నారు.