విజయవాడ నూతన పోలీస్ కమిషనర్‌గా బి. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావు... రైల్వే డీజీపీగా బదిలీ అయ్యారు.
ప్రకాశం జిల్లాకు చెందిన బత్తిన శ్రీనివాసులు 1998 బ్యాచ్‌కి చెందిన అధికారి. గ్రూపు-1 అధికారిగా పోలీసు శాఖలోకి ప్రవేశించిన ఆయన పదోన్నతిపై వివిధ బాధ్యతలను నిర్వర్తించారు. నల్గొండ, తూర్పుగోదావరి జిల్లాల ఎస్‌పీగా పనిచేశారు. హైదరాబాద్‌లో కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా వచ్చి.. దాదాపు 15నెలలు పనిచేశారు. ఆ తర్వాత ఎస్‌ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) డీఐజీగా, ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 18వ తేదీన నగర కమిషనరేట్ పరిధిలో కొన్నాళ్ల నుంచి ఖాళీగా ఉన్న అడిషనల్ సీపీ పోస్టులో నియమితులయ్యారు.
2018 జులై 19వ తేదీ విజయవాడ సీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా.. పాలనపై తనదైన ముద్ర వేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి శ్రద్ధ చూపారు. దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణలో తనదైన పనితీరు చాటుకున్నారు. సీపీకి ఆర్థికాధికారాలు ఉండేటట్లు చేశారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించేందుకు వాట్సాప్ నెంబరు 73289 09090 ను ప్రారంభించారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడకు చేరుకునేందుకు ‘ఇంటర్‌సెప్టర్’ వాహనాలను ప్రారంభించారు. స్త్రీల రక్షణ కోసం తీసుకొచ్చిన ‘శక్తి’ బృందాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడే అంకురార్పణ జరిగింది. నేర విభాగాన్ని ప్రక్షాళన చేయటంతో అట్టడుగున ఉన్న రికవరీ శాతం బాగా పెరిగింది. సైబర్ మిత్ర పేరుతో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాలపై ప్రజలకు, పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ‘'చేరువ'’ అనే మాసపత్రికను సొంతంగా ప్రారంభించారు.