ఆటలో నైపుణ్యం ఉన్నా... పోటీలకు వెళ్లాలంటే దారి ఖర్చులకు డబ్బులుండేవి కాదు. దాతల సాయంతో అతను రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాడు. పోటీల్లో బహుమతులు సాధించాడు. చదవుకున్న పాఠశాలలోనే శిక్షకుడిగా చేరాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గోపీ... ఏడో తరగతి చదివేటప్పటి నుంచి బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించాడు. ఆటపై మక్కువతో పలు పోటీల్లో బహుమతులు సాధించాడు. ప్రతిభకు పేదరికం అడ్డు కావొద్దని... తనకొచ్చే వేతనంలో కొంత పేద క్రీడాకారుల కోసం ఖర్చు చేస్తున్నాడు.
గోపి అమ్మ టిఫిన్ సెంటర్ నిర్వహకురాలు. రోజుకు రూ.200, తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు రూ.6వేలు సంపాదిస్తారు. వీటితో కుటుంబం గడవటం కష్టంగా ఉండేది. ఫలితంగా గోపీకి ఇష్టమైన ఆటలో రాణించడానికి ఆటంకం కలిగింది. అతని పట్టుదల చూసి తల్లిదండ్రులు అప్పు తీసుకరాగా... దాతలు సాయం చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం బెంగళూరులో డిప్లమా కోర్సు చదివాడు. ఏడాదిన్నర కిందట శాప్‌లో తాత్కాలిక శిక్షకుడుగా చేరాడు.
తాను నేర్చుకున్న క్రీడా పాఠశాలలోనే చిన్నారులకు బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నాడు. ప్రతిరోజూ సుమారు 30 మంది విద్యార్థులు గోపీ వద్ద సాధన చేస్తున్నారు. వీరిలో ఇద్దరు రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించారు. మరికొంత మంది యూనివర్సిటీ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటారు. గోపీ... పేద క్రీడాకారుల కోసం తన జీతంలో కొంత ఖర్చు చేస్తున్నాడు. తనలా ఎవరూ ఇబ్బందులు పడకూడదని... వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని గోపీ చెబుతున్నాడు.