రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూనే... మసీదులు, ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్.. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాసం, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ అని.. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని సీఎం ప్రార్థించారు.
కడప మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా.. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగు నింపాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలో కరోనా నిబంధనలు పాటిస్తూ... మసీదుల్లోనే ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకున్నారు. సప్తగిరి కూడలిలోని మసీదులో ఉదయం నుంచే ప్రార్థనలు నిర్వహించారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో బక్రీద్ వేడుకల్లో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జామియా మసీద్, కశింకోటలో నమాజ్ చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు చరవాణి సందేశాల ద్వారా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా కనుమరుగు కావాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. తెదేపా ఎమ్మెల్సీ ఎన్ఎం. డీ ఫరూక్ ప్రార్థన చేసి..పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలులో భక్తిశ్రద్ధలతో బక్రీద్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలను పాటిస్తూ ముస్లింలు మసీదుల్లో, ఇండ్లలో ప్రార్థనలు చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా నమాజ్ చేశారు.
ఇదీ చూడండి:
Gold Rate Today: ఏపీ, తెలంగాణలో తగ్గిన బంగారం ధరలు