సీఎం జగన్ తెచ్చిన మార్పు చూసే కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిందని... సజ్జల రామకృష్ణారెడ్డి అనటం విడ్డురంగా ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. 'ఇది మేము తీసుకున్న కరోనా చర్యలు, బ్రిటన్ దేశానికి ఆదర్శం అని డప్పు కొట్టుకునేలా ఉంద'ని విమర్శించారు. సంస్కరణలు అంటే రంగులు వేయడమా? అని నిలదీశారు. జగన్రెడ్డి తీసుకొచ్చిన ఒక్క సంస్కరణ చెప్పండని డిమాండ్ చేశారు.
కేంద్రం 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాభ్యాసం అంటుంటే దాని గురించి మాట్లాడే ధైర్యం ఎందుకు రాలేదని అయ్యన్న ప్రశ్నించారు. ఇవి చంద్రబాబు హయాంలో చేసిన పనులని గుర్తుచేశారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చ్యువల్ క్లాస్ రూమ్స్, పిల్లలకు స్కూల్ యూనిఫాం, మునిసిపల్ పాఠశాలల్లో... ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడే విధంగా అంగన్వాడీ స్కూళ్లను అభివృద్ధి, బాలికలకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం వంటి అనేక కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. నాడు-నేడు అంటూ రంగులు వేయడం తప్ప... ఈ 14 నెలలలో విద్యా రంగానికి ఏమి చేశారో సజ్జల చెప్పగలరా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.