కృష్ణా జిల్లాలోని కొల్లేరు అనగానే పక్షుల కిలకిల రవళులు, గలగల పారే నీటిప్రవాహాలే కాదు.. అక్కడ ఏ గ్రామాన చూసినా తీవ్ర తాగునీటి ఎద్దడి, దారుణంగా తయారైన రవాణా వ్యవస్థ, కనీస వైద్యం అందని దుస్థితి, పాఠశాలలకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం కాళ్లకు పని.. ఇక వర్షాకాలంలో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం సర్వసాధారణంగా కనిపించే అంశాలు. ఏళ్లుగా అధికారాన్ని అంటిపెట్టుకొన్న కొందరు పెద్దలు గ్రామాభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా కొల్లేరు గ్రామాల్లో స్థానికులు సమస్యలతో నిత్యసమరం చేస్తున్నారు. కుల కట్టుబాట్లను చీల్చుకుని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడంపై నాయకులు దృష్టిసారించాలి. నిస్వార్థ నాయకులు సర్పంచులుగా పోటీ చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతారనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల బాధలు వర్ణనాతీతం..
దేశంలోనే అతిపెద్దదైన మంచినీటి సరస్సు కొల్లేరు ఒడ్డున ఉంటున్నా ఇక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. సరైన తాగునీరు అందక స్థానికులు జబ్బుల బారిన పడుతూ ఆసుపత్రుల పాలవుతుంటారు. భారీఎత్తున వ్యర్థాలు, రసాయన అవశేషాలు, కొల్లేరు పరిసరాల్లో ఉన్న మంచి నీటి చెరువుల్లోకి చేరుతుండటంతో నీరు విషతుల్యంగా మారుతోంది. రక్షిత మంచినీటి పథకాలు సైతం పనిచేయకపోవడం ఇక్కడి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. వేసవి కాలంలో కనీసం కొల్లేరులో పశువులు తాగేందుకు, వాడుక నీరు లేక ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం.
రోడ్ల తీరే వేరు..
కొల్లేరు ప్రాంతంలోని చాలా రహదారులు అటవీశాఖ పరిధిలో ఉండడంతో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథులే కరవయ్యారు. గ్రామాలను మండల కేంద్రానికి కలిపే రహదారులన్నీ అధ్వానమే. అర్ధరాత్రి ప్రాణాపాయస్థితి వచ్చిందంటే కనీసం ఆటోలు లేని దుస్థితి వీరిది.
వైద్యం అంతంత మాత్రమే..
లంక గ్రామాల్లో వైద్యసదుపాయాల మాటే లేదు. కొల్లేటికోట వంటి గ్రామాల్లో ఆరోగ్యకేంద్రాలు ఉన్నా.. తగిన స్థాయిలో మందులు.. వైద్యులు.. సిబ్బంది అందుబాటులో ఉండరు. పరీక్షలు సైతం అంతంత మాత్రమే. ఏ ఇబ్బంది వచ్చినా ఆకివీడు, కైకలూరు, ఏలూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు పరుగెత్తాల్సిందే.
అందని ద్రాక్షలా విద్య..
కొల్లేరు గ్రామాల్లో విద్య అందని ద్రాక్షలా మారుతోంది. ప్రాథమిక విద్య వరకు గ్రామాల్లో ఉన్నా.. ఉన్నత విద్యకు నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సదుపాయాలు లేకపోవడంతో చదువుకు చరమగీతం పాడేస్తున్నారు. ఆడపిల్లలు ప్రాథమిక విద్యతోనే సరిపెట్టుకుంటున్నారు.
మౌలిక వసతుల కరవు..