AUTO WORKERS DHARNA AT VIJAYAWADA: తమ కార్మికులకు సంక్షేమ బోర్టు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ఆటో కార్మికులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఆటో కార్మికులు తమ డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుస్తానని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు మాత్రం న్యాయం చేయలేదని అన్నారు.
వాహన మిత్ర పథకం మాటున ప్రభుత్వం తన ఆటో, మోటారు కార్మిక వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుతుందని మండిపడ్డారు. జిల్లాలను విభజించడంతో ఆటో కార్మికులు ఇబ్బందులకు గురయ్యారని ఆయన అన్నారు. మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు భార్య, పిల్లల్ని పోషించుకునేందుకు పది, పదిహేను రూపాయల కిరాయి కోసం ఆటో తోలుకునే కార్మికునికి.. కేసులు ఉన్నాయి డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి కడతారని? ఆయన ప్రశ్నించారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.