విజయవాడ 16వ డివిజన్ కళానగర్ రెండో వీధిలో డేరంగుల రాములమ్మ తన కుమారుడు, కుమార్తెతో కలిసి ప్రభుత్వ స్థలంలో పాక వేసుకుని నివసిస్తోంది. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అధికారులను సంప్రదించగా... వారి అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా రాములమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు... నిర్మాణాన్ని కూల్చాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
అయినప్పటికీ నిర్మాణం ఆపకపోవడంతో సచివాలయాల ప్రణాళిక కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఘటన స్థలం వద్దకు వెళ్లారు. వీరి రాకను గుర్తించిన రాములమ్మ, ఆమె కుమార్తె గోవిందమ్మ, కుమారుడు దినేష్‌లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాన్ని కూల్చివేస్తే.. పెట్రోల్ పోసుకుంటామని సిబ్బందిని బెదిరించారు. అయినా సిబ్బంది వెనక్కు తగ్గకపోవడంతో వారిపై పెట్రోల్ చల్లారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.