రమ్మీ కోసం రాంగ్ ట్రాక్ పట్టాడు ఓ యువకుడు. సీఏ చదివినా... విలాసాలకు అలవాటుపడి పక్కదారిపట్టాడు. ఉద్యోగం చేసినా.. డబ్బు చాలకపోవటం వలన ఏటీఎం నేరాలకు పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన మధుసూదన్ చెన్నైలో సీఏ చదువుకునే సమయంలో ఆన్లైన్లో రమ్మీ ఆడేవాడు. ఆటలో రెండు లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడు. చెన్నై నుంచి నెల్లూరు వచ్చి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటిలో ఉన్న నగదు, బంగారం మత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి ఆ నగదుతో ఆన్లైన్ రమ్మీ ఆడి పోగొట్టుకున్నాడు. ఆ విషయం తన తల్లిదండ్రులకు తెలియడం వలన 2019లో విజయవాడకు మకాం మార్చాడు. తన అన్నయ్య స్నేహితుడు దగ్గర సింగ్‌నగర్‌లో ఉంటూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. ఉద్యోగం చేసి సంపాదించేదంతా.. రమ్మీ ఆటకే ఖర్చుపెట్టేవాడు. సంపాదన సరిపోక ఏటీఎం మిషన్ల వద్దకు నగదు డ్రా చేయడానికి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. పక్కా పథకం ప్రకారం ఖాతాలోని నగదు కాజేయడం మొదలుపెట్టాడు.
సాయం పేరిట మోసం
ఏటీఎం గురించి సరిగ్గా తెలియని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని... వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ కార్డ్ నంబరును తన ఫోన్లో నమోదు చేసుకునేవారు. కార్డు వెనుక ఉండే సీవీవీ నంబరును, కార్డు ముగింపు తేదీలు కాజేసి... రమ్మీ ఆన్లైన్లో ఎంటర్ చేసేవాడు. వారి ఫోన్‌కు ఓటీపీ రాగానే దాన్ని చూసి తన ఫోన్లో నమోదు చేసి నగదు తన ఖాతాకు బదిలీ చేసుకునేవాడు. సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో తన ఖాతా నుంచి నగదు మాయమైందనిఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగదు మళ్లించిన రమ్మీ ఖాతా ఆధారంగా నిందితుడి చిరునామా గుర్తించి.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటి వరకూ ఇలాంటి 7 నేరాలకు పాల్పడినట్లు నిందితుడి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒక కేసులో జైలుకూ వెళ్లొచ్చాడని దర్యాప్తులో తేలింది.