Atluri Rammohan Rao: రామోజీ గ్రూపు సంస్థల్లో దశాబ్దాలపాటు ఎండీగా సేవలందించిన.. అట్లూరి రామ్మోహనరావు అనారోగ్యంతో కన్నుమూశారు. మధ్యాహ్నం.. ఒంటి గంట 49 నిమిషాలకు హైదరాబాద్ లోని.. AIGలో తుదిశ్వాస విడిచారు. రామమోహనరావు పార్థివదేహాన్ని బంధు, మిత్రుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. రామమోహనరావు భౌతికకాయానికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నివాళులు అర్పించారు.
రామమోహనరావు భౌతికకాయాన్ని సందర్శించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. నివాళులు అర్పించారు. రామోజీరావు కుటుంబసభ్యులు, గ్రూపు సంస్థల సీనియర్ ఉద్యోగులు రామమోహనరావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తిని వదిలి.. ఈనాడుకి తరలి:1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో.. రామమోహనరావు జన్మించారు. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలి.. 1974లో ఈనాడులో ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1982లో... ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది 1995 వరకూ కొనసాగారు. 1992 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణ వ్యవహారాల్లోనూ.. పాలుపంచుకున్నారు. 1995లో ఫిల్మ్ సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలం ఆ బాధ్యతల్లో కొనసాగారు.
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు.. రామమోహనరావు బాల్య స్నేహితుడు, సహాధ్యాయి. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిన్నతనం నుంచే.. కలిసి పెరిగారు. ఇంటర్, డిగ్రీ కూడా.. కలిసి చదువుకున్నారు. డిగ్రీ తర్వాత రామమోహనరావు కార్మిక శాఖలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత.. బీఎడ్‌లో సీటు రావడంతో క్లర్క్ కొలువుకు రాజీనామా చేసి గుంటూరు ఏసీ కళాశాలలో చేరారు. అక్కడ కోర్సు పూర్తయ్యాక కర్నూలులో.. ఉపాధ్యాయ జీవితం ప్రారంభించారు. పిల్లలు, పాఠాలు పరీక్షల మధ్య చాలాకాలం ఉపాధ్యాయవృత్తే.. ప్రపంచంగా గడిపారు.