Atluri Narayana Rao Petition to the Union Law Minister : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సంచాలకులు శ్రీ అట్లూరి నారాయణరావు.. కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి ప్రతాన్ని అందించారు. దిల్లీలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కలిసి వినతి పత్రాన్ని ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయ రాక్షస కుట్ర ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలు పాలయ్యారన్న శ్రీ అట్లూరి నారాయణరావు... వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగకపోయినా.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరు అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే 2.13 లక్షల మందికి అతి తక్కువ ఖర్చుతో శిక్షణ ఇచ్చారని, మరింత నైపుణ్యానికి పదును పెట్టేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం... వాటిని సద్వినియోగం చేసుకోవాలే తప్ప.. నిరుద్యోగుల భవితవ్యాన్ని నిర్లక్ష్యం చేయడం విచారకరం అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత.. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తీసుకున్న నిర్ణయాలు రెండంకెల వృద్ధి రేటును సాధించే స్థాయికి ఎదిగాయని శ్రీ అట్లూరి నారాయణరావు తెలిపారు. కానీ, వ్యవస్థలను ధ్వంసం చేస్తూ.. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేకపోతోందని వాపోయారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు మహిళలు అన్ని వర్గాల వారు జగన్ పరిపాలన వల్ల నష్టం పోతున్నారు. ఈ గందరగోళం, అరాచకాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను ఎలాగైనా గట్టెక్కించేది కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అని అందరూ అంటున్నారని తెలిపారు. దీంతో విసిగిపోయిన జగన్.. ఎలాగైనా చంద్రబాబును జైలుకు పంపాలని రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని తెలిపారు.