Asian Games Winners CM Meet 2023 : ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. పథకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19 వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి, తాము సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్నారంటూ క్రీడాకారులను సీఎం అభినందించారు.
ప్రభుత్వ ప్రోత్సాహకం...క్రీడాకారుల్లో నూతనోత్తేజం
CM Encouragement to Asian Game Winners in AP :క్రీడలకు మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నామన్నామని సీఎం తెలిపారు. అనంతరం స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఏషియన్ గేమ్స్ సిల్వర్ మెడల్ విజేత, విశాఖ పట్నానికి చెందిన టెన్నిస్ క్రీడా కారుడు మైనేని సాకేత్ సాయికి రూ.20 లక్షల నగదు బహుమతి అందించారు. ఏషియన్ గేమ్స్‌లో 3 గోల్డ్ మెడల్స్ సాధించిన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు రూ. 90 లక్షల నగదు మంజూరు చేశారు. బాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ విజేత గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు 20 లక్షలు ప్రోత్సాహకం విడుదల చేశారు. సిల్వర్, గోల్డ్ మెడల్ విజేత రాజమహేంద్రవరానికి చెందిన బాడ్మింటన్ ఆటగాడు ఆర్. సాత్విక్ సాయిరాజ్‌కు రూ. 50 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.