ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

COCK FIGHTS IN AP: కత్తిగట్టి కయ్యానికి సై అంటున్న పందెం కోళ్లు.. సిద్ధమైన బరులు

COCK FIGHTS IN ANDHRA PRADESH : సంక్రాంతికి పందెం కోడి కాలు దువ్వుతోంది. కత్తిగట్టి కయ్యానికి సై అంటోంది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వెనకుండి నడిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి పందెంరాయుళ్లు వస్తున్నారు. కోడి పందేల్లో రూ.కోట్లలో లావాదేవీలు జరగనున్నాయి.

cock fight
cock fight

By

Published : Jan 13, 2022, 7:36 AM IST

COCK FIGHTS IN ANDHRA PRADESH : ఆయన ఓ ప్రజాప్రతినిధికి స్వయంగా వియ్యంకుడు. ఆయన ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ఓ మామిడితోటలో కోడిపందేలకు బరి సిద్ధం చేశారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాలు అంటూ కోడి పుంజులు ఢీకొట్టే చిత్రాలు, స్థలం, సంప్రదించాల్సిన చిరునామాలు, ఫోన్‌నంబర్లతో కరపత్రాలు, వాట్సప్‌ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మా వద్ద రొయ్యలు, మెత్తల్లు, చేపలు, మటన్‌, చికెన్‌ తదితర వంటకాలతో మాంసాహారం లభించును అంటూ ట్యాగ్‌లైన్‌ పెట్టి మరీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఈ బరికి సమీపంలో అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం.

  • కొల్లేరు సరస్సులోని లంక గ్రామానికి చెందిన ఓ చేపల వ్యాపారి భైరవపట్నంలో జరిగే కోడిపందేల కోసం ఒక్కో పుంజుకు రూ.3లక్షల వెచ్చించి మూడు కొనుగోలు చేశాడు. ఒక్కో పుంజుపై హీనపక్షం రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు ఉంటేనే బరిలోకి దించుతాడట! వీటి పోరు కోసం స్థానికులు, పందెంరాయుళ్లు ఆత్రుతగా ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలోనే మరో వ్యాపారి రూ.50 వేలు చొప్పున 15 కోళ్లు కొనుగోలు చేసి సిద్ధం చేశారు.
  • కొల్లేరు లంక గ్రామాల్లో పలుచోట్ల పందేల నిర్వహణకు వేలం వేశారు. గరిష్ఠంగా ఓ గ్రామంలో రూ.9 లక్షలకు సొంతం చేసుకున్నాడో వ్యక్తి. పందెం కాసిన వ్యక్తుల నుంచి 10శాతం కమీషన్‌ ఈ నిర్వాహకుడికి దక్కనుంది. బరి సమీపంలో పేకాట, గుండాట, మాంసం, మద్యం దుకాణాలకు అదనపు సొమ్ము వసూలు చేస్తారు. ఐస్‌క్రీం బండి పెట్టాలన్నా ఇతని అనుమతి కావాల్సిందే.

కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ‘సంక్రాంతి సంబరాలు’ పేరుతో కోడిపందేల బరులు సిద్ధమయ్యాయి. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వెనకుండి నడిపిస్తున్నారు. వారి బంధువులు, పీఏలు స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల కొన్నిచోట్ల బరులను ట్రాక్టర్లతో దున్నేసిన పోలీసులు.. ప్రస్తుతం నేతల సిఫార్సు కారణంగా మౌనం దాల్చారు. తెలంగాణ సరిహద్దుల్లోనూ భారీగా బరులు సిద్ధమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పందెంరాయుళ్లు వస్తున్నారు. కోడి పందేల్లో రూ.కోట్లలో లావాదేవీలు జరగనున్నాయి. కృష్ణా జిల్లాలో గుడివాడ, పెనమలూరు, మైలవరం, కైకలూరు, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ, గోదావరి జిల్లాల్లోని భీమవరం, నరసాపురం, ఏలూరు, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బరులు సిద్ధమయ్యాయి. కోడి ఖరీదు, దానిమీద కాసే పందెం, పైపందేలు ఒక ఎత్తైతే.. బరుల వద్ద మద్యం, మాంసాహారం అమ్మకాలు ఒక ఎత్తు. నిషేధిత జూదక్రీడలైన పేకాట, గుండాటలకూ బహిరంగంగానే ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ వేలల్లో జనం గుమికూడటంపై ఆందోళన నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలోని తిమ్మాపురంలో ఏడీబీ రహదారికి ఆనుకుని తోటల్లో ఏర్పాటు చేసిన భారీ బరి ఇది. షామియానాలు, ఇనుప కంచెలతో పక్కాగా చేసిన ఏర్పాట్లు.

ఇదీ చదవండి

Ready for Cockfights at AP: సంక్రాంతి బరికి సిద్ధమైన పందెం కోళ్లు.. 6 నెలల ముందు నుంచే శిక్షణ

ABOUT THE AUTHOR

...view details