Jana Sena Formation Day Meeting : మంగళవారం (14వ తేదీ) మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జెండాను నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. సభకు దూర ప్రాంతాల నుంచి వచ్చే జన సైనికులు, వీర మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు అనుమతించిన పోలీస్ శాఖకు పార్టీ తరఫున ధన్యవాదాలు ప్రకటించారు.
ప్రత్యేక గీతం: జనసేన ఆవిర్భావ సభకు ప్రత్యేక గీతం విడుదలైంది. 14వ తేదీన మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. దీంతో వారాహి వాహన నేపథ్యంతో ఈ గీతాన్ని రూపొందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికారపార్టీ నేతల ఆరాచకాలు, వైసీపీ సర్కారు తీరుతో ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజెప్పేలా ఈ పాట సాగుతుంది.
వైఎస్సార్సీపీ పాలనలో బీసీల వెనుకబాటు.. బీసీల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో బీసీల అభివృద్ధిపై పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపడంపై జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు ఇప్పటివరకు జరిగిన అన్యాయంపై జనసేన సమావేశం ఏర్పాటు చేయడంతో వైసీపీ పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. బీసీల లబ్ధి కోసం ఇప్పటివరకు ఏమేం ప్రయోజనాలు చేకురాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బటన్ నొక్కుడు పేరుతో 30 శాతం బీసీలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ సోదరులు వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు.