ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో మున్సిపల్​ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు - arrangements for municipal elections news

కృష్ణా జిల్లాలో మున్సిపల్​ ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. అన్ని పురపాలికల్లో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. గతేడాది నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో మరణించిన వారి విషయంలో, బదిలీ అయిన ఆర్వోలకు సంబంధించి ఎస్​ఈసీ పలు సూచనలు చేశారు.

arrangements for municipal elections
మున్సిపల్​ ఎన్నికలకు ఏర్పాట్లు

By

Published : Feb 19, 2021, 3:07 PM IST

మున్సిపల్​ ఎన్నికలను తిరిగి కొనసాగించేందుకు ప్రకటన ఇవ్వటంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు నూజివీడు, నందిగామ, ఉయ్యూరు, పెడన, తిరువూరు పురపాలికలకు వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది మార్చిలో ఆగిన ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అన్ని పురపాలికల్లో ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. వచ్చే నెల 2న నామినేషన్ల ఉపసంహరణతో మొదలవుతుంది. 3వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అదే రోజు రాత్రికి బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు తేలతాయి. ఇప్పటికే ఊపందుకున్న ప్రచారం.. ఉపసంహరణ తర్వాత ఉద్ధృతంగా సాగే అవకాశం ఉంది.

దాదాపు ఏడాది తర్వాత ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో మళ్లీ ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నం అయ్యారు. అన్ని పురపాలకసంఘాల్లో ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. గత ఏడాది క్రోడీకరించిన సమాచారాన్ని, దస్త్రాలకు బూజు దులిపి సిద్ధం చేస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో బుధవారం నాడు ఎన్నికల పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సహాయ కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) శారదాదేవి, ఎస్టేట్‌ అధికారి శ్రీధర్‌, పట్ణణ ప్రణాళిక అధికారి లక్ష్మణరావు నేతృత్వం వహిస్తున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసే పనిని ప్రారంభించారు. కార్పొరేషన్లలో ఎక్కడికక్కడ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గత ఏడాది ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన పూర్తైన తర్వాత ఆగింది. విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లకు గాను మొత్తం 801 నామినేషన్లు పడ్డాయి. వీటిలో 34 తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన అనంతరం 733 సక్రమంగా ఉన్నట్లు తేలింది. పెడనలో 23 వార్డులకు మొత్తం 99 నామపత్రాలను దాఖలు చేశారు. ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఉయ్యూరులోని 20 వార్డులకు 108 నామినేషన్లు దాఖలయ్యాయి. నందిగామ పురపాలికలో 20 వార్డులకు గాను 135 నామపత్రాలు వేశారు. ఇందులో రెండింటిని తిరస్కరించారు. మిగిలిన 133 సక్రమంగా ఉన్నాయి. తిరువూరు మున్సిపాలిటీలోని 20 వార్డులకు మొత్తం 133 పడ్డాయి. ఇవన్నీ సరిగానే ఉన్నాయని అధికారులు ప్రకటించారు. నూజివీడు మున్సిపాలిటీలోని 32 వార్డులకు 151 నామినేషన్లు వేశారు. అన్నీ సరిగానే ఉన్నట్లు ప్రకటించారు.

పోటీలో ఉన్న ప్రధాన పార్టీల్లో నలుగురు అభ్యర్థులు మరణించారు. విజయవాడ ఇద్దరు, తిరువూరు, మచిలీపట్నంలో ఒక్కొక్కరు చనిపోయారు. అభ్యర్థులు మృతి చెందిన డివిజన్లు, వార్డుల్లోని పరిస్థితిపై ఎస్‌ఈసీ సంబంధిత పురపాలికల నుంచి నివేదిక కోరింది. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన మార్గదర్శకాలను బట్టి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. వాయిదా వేయడమా? లేక ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో ఒకరికి అవకాశం ఇవ్వడమా? అనేది తేలుతుంది. విజయవాడ నగరపాలికలో గత ఏడాది నియమించిన ఆర్వోలు పలు చోట్లకు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఎస్‌ఈసీ సూచించింది. కొత్త ఆర్వోల నియామకం కూడా త్వరలో కొలిక్కి రానుంది.

ఇదీ చదవండి:

నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం:ఎస్ఈసీ

ABOUT THE AUTHOR

...view details