ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIJAYAWADA INDRAKEELADRI: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు దసరా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.1.85 కోట్లతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

arrangements-for-indrakeeladri-ammavari-celebrations
ఇంద్రకీలాద్రిపై ఉన్న జగన్మాత ఉత్సవాలకు ఏర్పాట్లు

By

Published : Oct 6, 2021, 7:35 AM IST

ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే దసరా మహోత్సవాలకు రూ.1.85 కోట్లతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 5వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ వర్షాల కారణంగా 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతావి త్వరగా పూర్తి చేస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు.

  • కెనాల్‌ రోడ్డు వినాయకుడి గుడి నుంచి రథం సెంటరు వరకు, దుర్గగుడి టోల్‌గేటు నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయం వరకు క్యూలైను ఏర్పాటు పనులు పూర్తి చేశారు.
  • దుర్గగుడి టోల్‌గేటు వద్ద ఉన్న గోపురం, నటరాజమండప మార్గం, కామధేను అమ్మవారి ఆలయాలకు రూ.26 లక్షలతో రంగులు వేశారు. కనకదుర్గ నగర్‌లో ప్రసాదాల కౌంటరు ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి.
  • కనకదుర్గ పై వంతెన దిగువన తాత్కాలిక కేశఖండన శాల ఏర్పాటు పనులను దేవస్థానం అధికారులు చేపట్టారు. సీతమ్మ వారి పాదాల సెంటరు వెనక భాగంలో కేశఖండన శాల టిక్కెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించిన అనంతరం కృష్ణవేణి ఘాట్‌లో జల్లు స్నానాలు పూర్తి చేసుకొని కెనాల్‌ రోడ్డు వినాయకుడి గుడి వద్ద క్యూలైన్లో ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • క్యూలైన్లో ప్రవేశించిన భక్తులు నేరుగా దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మార్గం నుంచి అమ్మవారి ఆలయానికి చేరే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణవేణి ఘాట్‌, పద్మావతి ఘాట్‌ వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రథం సెంటరు వద్ద పాదరక్షల స్టాండ్‌, క్లోక్‌ రూమ్‌ ఏర్పాటు పనులు పూర్తి చేయాల్సి ఉంది.
  • విజయదశమి రోజున ఆది దంపతుల జలవిహారానికి రూ.6 లక్షల వ్యయంతో హంస వాహన నిర్మాణం.
  • కొండ దిగువన 1.5 కిలోమీటర్ల పరిధిలో రూ.18 లక్షల వ్యయంతో క్యూలైన్లు
  • ఘాట్‌ రోడ్డు మార్గంలో అర కిలోమీటరు పరిధిలో రూ.4 లక్షల వ్యయంతో క్యూలైన్లు. ● కనకదుర్గానగర్‌, ఘాట్‌ రోడ్డు మార్గంలో ఓంకార మలుపు, గోశాల వద్ద రూ.40 లక్షలతో వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలు ● కనకదుర్గ నగర్‌, రాజగోపురం వద్ద రూ.5 లక్షల వ్యయంతో మైకు ప్రచారం కేంద్రం.
  • కెనాల్‌ రోడ్డు వినాయకుడి గుడి, కేశఖండన శాల, కృష్ణవేణి ఘాట్‌, దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మార్గం, అంతరాలయం, కనకదుర్గా నగర్‌లో తాత్కాలికంగా రూ.2.50 లక్షలతో దేవస్థానం, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో సీసీ కెమెరాల ఏర్పాటు.

భక్తులకు ఇబ్బంది లేకుండా ..

దసరా ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపై దుర్గగుడి ఈఈ భాస్కర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. తాత్కాలిక కేశఖండన శాల, ప్రధాన ఆలయం, ఉపాలయాలు, మల్లేశ్వరాలయాలకు విద్యుదీకరణ పనులు పూర్తవుతాయన్నారు. కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు, క్యూలైను ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి:TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details