ఆదివారం జరిగే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లాలో జరిగే పోలింగ్‌కు అంతా సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. నూజివీడు డివిజన్‌లో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. డివిజన్లోని 14 మండలాల పరిధిలోని 275 పంచాయతీల్లో సర్పంచి, 2483 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉయ్యూరు మండలంతో పాటు పమిడిముక్కలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా నూజివీడు వచ్చిన ఎస్పీ పోలీసు బందోబస్తును పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా, అక్రమంగా నగదు, ఇతర వస్తువుల రవాణాను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
- పోలీస్ కంట్రోల్ రూం: 8332983792
- పోలీస్ హెల్ప్ లైన్: 9491068906
- పోలీస్ వాట్సప్: 9182990135