కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కోసం కృష్ణా జిల్లా ఎంపికైనందున..సంబంధిత జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆదివారం నుంచి 29 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా 28న పూర్తిస్థాయి డ్రైరన్ నిర్వహించనుండగా..ముందస్తుగా మరికొన్ని కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. 27వ తేదీ కో-విన్ యాప్, వెబ్ సైట్‌కు సంబంధించిన డ్రైరన్, 28న లాజిస్టిక్ సంబంధిత మాక్ డ్రిల్ , అలాగే 29న వ్యాక్సినేషన్ ట్రయల్ రన్ చేయాలని నిర్ణయించారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రితో పాటు... ప్రైవేటు ఆస్పత్రిగా విజయవాడలోని పూర్ణా హార్ట్ సెంటర్, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీ, అర్బన్ ప్రాంతంగా విజయవాడ ప్రకాశ్ నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పెనమలూరులోని తాడిగడప గ్రామ సచివాలయం వద్ద 28 తేదీన కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి కేంద్రంలోనూ 25 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసేలా డ్రైరన్‌ను నిర్వహించనున్నారు.