Arogyamithra Job Problems: తమ ప్రభుత్వం వస్తే ఆరోగ్యమిత్రలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం జగన్ గతంలో మాట ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా వారి జీవితాల్లో వెలుగులు లేవు. వారి సమస్యలు పరిష్కారం కాలేదు. తమకు కొంత జీతం పెంచి.. ప్రభుత్వ పథకాలు అన్నీ కట్ చేశారని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 వేల రూపాయల వేతనంతో కుటుంబ భారాన్ని మోయలేక నరకయాతన అనుభవిస్తున్నారు. 15 ఏళ్ల నుంచి ఉద్యోగం చేసినా అవుట్ సోర్సింగ్‌లోనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్యమిత్రలు డిమాండ్ చేస్తున్నారు.
రోగులను సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రదే: సీఎం
Arogyamithra Employees Problems in AP: ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు అందించే ప్రక్రియలో ఆరోగ్యమిత్రలు కీలక వ్యక్తులు. కానీ, వారి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యమొస్తే డబ్బు ఖర్చు పెట్టి వైద్య చికిత్స చేయించుకోవాల్సిందే. 15 ఏళ్ల నుంచి అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం చేస్తున్న తమకు 15 వేల రూపాయలు వేతనం వస్తోందని, ఈ చాలీ చాలని జీతంతో కుటుంబ నిర్వహణ భారంగా మారుతోందని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారానికి విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఆరోగ్య మిత్రలు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది ఆరోగ్యమిత్రలుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచింది. కానీ.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నపెన్షన్, తెల్లరేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లాంటి పథకాలు నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే 15 వేల రూపాయల జీతంపైనే కుటుంబాన్ని నడపాల్సి వస్తోందని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.