ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్‌డౌన్‌ నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ పొదుపు చర్యలు - ఏపీఎస్‌ఆర్టీసీ పొదుపు చర్యలు

లాక్‌డౌన్‌ అనంతరం బస్సులు తిప్పినా ఆశించిన లాభాలు రావని భావిస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ పొదుపు చర్యలకు సిద్ధమవుతోంది. సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా కొంత భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. సరకు రవాణా విస్తరణ సహా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. బస్సుల్లో సిబ్బంది సహా ప్రయాణికులు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

లాక్‌డౌన్‌ నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ పొదుపు చర్యలు
లాక్‌డౌన్‌ నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ పొదుపు చర్యలు

By

Published : May 15, 2020, 3:58 PM IST

లాక్‌డౌన్‌ నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ పొదుపు చర్యలు

లాక్‌డౌన్‌ నష్టాలతో కష్టాలపాలైన ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యామ్నాయ విధానాలతో గట్టెక్కేందుకు యత్నిస్తోంది. సిబ్బంది సేవలు సద్వినియోగం చేసుకోవటం ద్వారా కొంతమేర భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇచ్చినా కొంతకాలం ప్రజారవాణాపై ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో కొన్నినెలలపాటు పూర్తిస్థాయిలో బస్సులు తిప్పే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సిబ్బందిని సమర్థంగా వినియోగించుకునేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. కరోనా వ్యాప్తి నివారణ కోసం కండక్టర్‌ లేకుండానే బస్సు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ... వారిని ఇతర విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించింది. కరోనా విధుల్లో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల స్థానంలో కండక్టర్లను నియమించి విధులు అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అదనంగా ఉన్న డ్రైవర్లను తేలికపాటి వాహనాలు లేదా పార్కింగ్‌ విధుల కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తద్వారా పొరుగుసేవల ఉద్యోగుల భారాన్ని కొంతమేర తగ్గించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్‌డిపోలు, కార్యాలయాల పరిధిలో సంస్థ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆదేశించింది. ఎక్కడైనా ఆక్రమణకు గురైతే వెంటనే పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్టాండ్లు, వాణిజ్య సముదాయాల్లో ఇదివరకే ప్రారంభమైన అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించింది. కండక్టర్లలో ఎవరైనా సాంకేతిక విద్య అభ్యసించి ఉంటే వారిని సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో విధులకు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని యూనియన్ల నోటీసు బోర్డులను వెంటనే తొలగించాలని..ఇకపై తెలుగుభాషలో నోటీసుబోర్డు ద్వారా ప్రధాన కార్యాలయం నుంచే ఉద్యోగులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.

లాక్‌డౌన్‌ అనంతరం బస్సులు రాకపోకలు సాగించే సమయంలో బస్టాండ్లకు పెద్దఎత్తున ప్రయాణీకులు వచ్చే అవకాశముండటంతో వారి పరిశుభ్రతపై దృష్టిపెట్టింది. బస్సులు, బస్టాండ్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలనే కేంద్రం ఆదేశాలు అమలుచేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. బస్టాండ్లలోని అన్ని దుకాణాల్లో నాణ్యమైన బ్రాండెడ్‌ మాస్క్‌లు, శానిటైజర్ల అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించింది. నిర్ణీత ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం దుకాణదారుల వద్ద నుంచి అదనపు ఫీజు వసూలు చేయకుండానే లైసెన్సులు ఇవ్వాలని ఎండీ ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణానికి మాస్కులు ధరించడం, శానిటైజర్లతో చేతులు శుభ్రపరుచుకోవటం తప్పనిసరి చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ప్రయాణీకులకు ఆరోగ్యభద్రత కల్పిస్తూనే అవసరమైన మేరకు మాత్రమే సర్వీసులు నడపటం ద్వారా నష్టాలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఇవీ చదవండి

ఆర్టీసీ ప్రయాణీకులపై రూ.700 కోట్ల భారం

ABOUT THE AUTHOR

...view details