APSRTC Employee Unions: డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 6 నుంచి సమ్మె లోకి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు సమాయత్తమవుతున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి సమ్మెకోసం కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్య వేదిక పేరిట ఆర్టీసీ ఉద్యోగులు సమావేశం కానున్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె లోకి వెళ్లాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నేటి ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది. ఆర్టీసీ ఎన్ఎంయూ, ఈయూ ,ఎస్‌డబ్ల్యూఎఫ్ సహా అన్ని సంఘాల నేతలు హాజరు కానున్నారు. సమావేశానికి పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు పాల్గొంటారు. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు ఫిట్ మెంట్ ఇవ్వాలని సమావేశంలో చర్చించనున్నారు. వైద్యపరంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు సహా కోల్పోయిన పీఆర్సీని తిరిగి రాబట్టుకోవడం , సర్వీసు రూల్స్ లో జరుగుతోన్న అన్యాయం తదితర సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు.