ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాబడి పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు..: ఏపీఎస్​​ ఆర్టీసీ ఎండీ - ఆర్టీసీ పరిస్థితి

కరోనా కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్జించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. సంక్రాంతికి 3,607 ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. తెలంగాణకు అదనపు సర్వీసులు నడిపేలా చర్చలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2017లో ఉన్న ఆర్పీఎస్‌ బకాయిలు జనవరి నుంచి చెల్లిస్తామని ప్రకటించారు. ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనమైనప్పటికీ.. వారికి ప్రభుత్వ సేవల్లో సమానమైన క్యాడర్ల కేటాయింపు ఇతర అంశాలపై ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదానికి పంపామన్నారు.

rtc managing director explaining
ఆర్టీసీ పరిస్థిలు వివరిస్తున్న మేనేజింగ్‌ డైరెక్టర్

By

Published : Dec 30, 2020, 8:43 PM IST

ఆర్టీసీ పరిస్థిలు వివరిస్తున్న మేనేజింగ్‌ డైరెక్టర్

ప్రజారవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని సంస్థ ఎండీ కృష్ణబాబు అన్నారు. ఆర్టీసీ స్థితిగతులపై విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో ఎండీ మీడియా సమావేశంలో మాట్లాడారు.

కరోనా సమయంలో సంస్థ తీవ్ర ఇబ్బందులు పడినా ఉద్యోగులకు వేతనాలు, ఇతర సమస్యలు తలెత్తలేదని అన్నారు. ఇప్పుడిప్పడే ఆర్టీసీ గాడిలో పడుతోందని అన్నారు. 5586 మంది సంస్థ ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకిందని... వారిలో 91 మంది మృతి చెందారని చెప్పారు. చనిపోయిన కుటుంబాల వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల ఆర్ధిక సాయం అందించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణాశాఖలో వీలీనమైనప్పటికీ.. వారికి ప్రభుత్వ సర్వీసుల్లో సమానమైన కేడర్ల కేటాయింపు, పేస్కేల్‌ ఖరారు వివరాలు పీఆర్సీకి అందజేశామని తెలిపారు. వీరి సర్వీస్‌ రూల్స్, కండక్ట్‌ రూల్స్, సీసీఏ రూల్స్‌ వివరాలను ప్రభుత్వ ఆమోదానికి పంపగా ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయన్నారు.

మార్చినాటికి సాధారణ పరిస్థితికి..

లాక్‌డౌన్‌తో సర్వీసులు నిలిపేయడం, తర్వాత కొన్ని సర్వీసులే ప్రారంభించడం వల్ల ఇప్పటి వరకు సంస్థ రూ.2,603 కోట్ల మేర రాబడి కోల్పోయిందని మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణబాబు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే 78.84 కోట్ల కిలోమీటర్ల మేర సర్వీసులు నడపలేకపోయామని చెప్పారు. ఓఆర్‌ గత ఏడాది సగటున 78.22 శాతం ఉండగా.. ఈసారి 59.14 శాతం ఉన్నట్లు వివరించారు. డిసెంబరులో ఓఆర్‌ 70.74 శాతానికి పెరిగిందని, మార్చినాటికి సాధారణ పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ ఆదాయానికి కొత్త మార్గాలు:

ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కొత్త మార్గాల అన్వేషణలో భాగంగా కార్గో సర్వీసులు.. బస్టాండ్ల ఆధునీకరణ.. బీఓటీ విధానంలో స్థలాల లీజు.. బస్టాండు ప్రాంగణాల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కార్గొ, పార్శిల్‌ సర్వీసులను మరింత విస్తృతం చేయనున్నామన్నారు. ఇంటివద్దకే సరకు రవాణాకు కసరత్తు చేస్తున్నామని.. నాలుగు చోట్ల విమానాశ్రయాలు మాదిరిగా ఇంటిగ్రేట్‌ బస్టాండ్లు, 10 చోట్ల ఆర్టీసీ స్థలాలు బీవోటీ రూపంలో లీజుకు ఇవ్వడం ద్వారా మరింత ఆదాయం పొందేలా చూస్తున్నామని వివరించారు.

సంక్రాంతి సర్వీసులు:

సంక్రాంతికి 3,607 బస్సులను రాష్ట్ర పరిధితోపాటు అంతర్‌ రాష్ట్ర సర్వీసులు నడుతున్నామని ఎండీ తెలిపారు. సంక్రాంతికి నడిపే ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా ఉంటుందన్నారు. అంతరాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో నిత్యం 1.60 లక్షల కిలోమీటర్లు నడిపేందుకు ఒప్పందం చేసుకుందని.. దీనివల్ల గతంకంటే 1.04 లక్షల కిలోమీటర్లు తగ్గాయని కృష్ణబాబు పేర్కొన్నారు. ఈ సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి చేరుతుండటంతో.. ఇరు ఆర్టీసీలు నిత్యం మరో 48 వేల కిలోమీటర్ల మేర అదనపు సర్వీసులు నడిపేలా చర్చలు జరిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖరాశామన్నారు.

రహదారుల వల్లే సర్వీసులు ఆలస్యం:

వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వల్ల బస్సులు కొంత ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుతున్నది నిజమేనని అంగీకరించిన కృష్ణబాబు.. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం 550 కోట్లు రూపాయలు మంజూరు చేసిందని, పాత నిర్వహణ బకాయిలు సైతం చెల్లించడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. జనవరి 10 నాటికి టెండర్లు పూర్తిచేసి, ఫిబ్రవరి చివరి నాటికి.. 50 రోజుల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రొద్దుటూరులో నారా లోకేశ్ ఆందోళన.. స్థానిక ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్

ABOUT THE AUTHOR

...view details