TDP edem karma mana rastraniki program latest updates: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమం పునఃప్రారంభం అవుతుంది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు మూడు రోజుల్లో.. ఏయే రోజున ఏయే ప్రాంతంలో పర్యటించనున్నారు..?, ఎక్కడెక్కడ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు..?, ఏయే ప్రాంతాల్లో బస చేయనున్నారు..? అనే తదితర వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈనెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటన: వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ క్రమంలో మళ్లీ ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు వచ్చేవారం పునఃప్రారంభించబోతున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నా రు. ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు రోజులపాటు ఆయన పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పర్యటన వివరాలు ఇలా..:పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..'12వ తేదీన నూజివీడులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించనున్న చంద్రబాబు.. రాత్రికి అక్కడే బస చేస్తారు. 13 మధ్యాహ్నం గుడివాడలో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించి.. రాత్రికి నిమ్మకూరులో బస చేస్తారు. 14న మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. (అంటే 12వ తేదీన నూజివీడు, 13వ తేదీన గుడివాడ, 14వ తేదీన బందరులో రోడ్ షోలు నిర్వహిస్తారన్నమాట)'