ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Group-1 selections : గ్రూప్‌-1 పరీక్షలపై నిరాధార ఆరోపణలు: ఏపీపీఏస్సీ - appsc

ఏపీపీఎస్సీపై గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపణలు చేశారని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు అన్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులపై ..మిగతవారు ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో 75 మంది ఎంపికపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఎంపిక జరిగిందని.. అభ్యర్థుల నిరాధార ఆరోపణలు సరికాదన్నారు. అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

APPSC Member SalamBabu talked  on Group-1 selections
ఏపీపీఎస్సీ

By

Published : Jun 24, 2021, 1:50 PM IST

Updated : Jun 25, 2021, 3:27 PM IST

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో కమిషన్‌పై వస్తున్న విమర్శలు నిరాధారమైనవని ఏపీపీఏస్సీ సభ్యుడు సలాం బాబు స్పష్టం చేశారు. అభ్యర్థుల జవాబు పత్రాల డిజిటల్‌ మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. ఛైర్మన్‌ ఉదయ భాస్కర్‌ ప్రతిపాదనల మేరకే కమిషన్‌ డిజిటల్‌ మూల్యాంకనం విధానాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు. జవాబు పత్రాల స్కానింగ్‌, సాంకేతిక అంశాలకే థర్డ్‌ పార్టీ పరిమితమని తెలిపారు. అర్హులైన, సీనియారిటీ ఉన్న ప్రొఫెసర్ల ద్వారానే జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందని వెల్లడించారు. ఏపీపీఏస్సీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సలాం బాబు మాట్లాడారు. ‘

'నిబంధనలను అనుసరించి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించాం. ప్రధాన పరీక్ష ద్వారా స్పోర్ట్స్‌ కోటాలో 75 మందిని మౌఖిక పరీక్షకు ఎంపిక చేశాం. కానీ... వీరిలో ఫాం-1 (శాప్‌ జారీ చేసే) ధ్రువపత్రాన్ని ఎవరూ పొందలేకపోయారు. దాంతో ఆ పోస్టులనూ జనరల్‌ కోటాలో భర్తీ చేస్తాం. విజ్ఞప్తులు చేసిన వారికే కాకుండా పరీక్షలను అందరికీ ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో రాసే అవకాశాన్ని కల్పించాం. కాకినాడ, శ్రీకాకుళం పరీక్షా కేంద్రాల్లో పలువురు అభ్యర్థులకు అందచేసిన బుక్‌లెట్లలోని కాగితాలు చిరిగినందున బఫర్‌లో ఉన్న బుక్‌లెట్లు ఇచ్చాం. ఈ విధానం ఎప్పట్నుంచో అమలులో ఉంది. ఇలాంటి వారిలో పలువురి పేర్లు మెరిట్‌ లిస్టులో ఉంటే తప్పేముంది. ఓ అభ్యర్థి కొన్ని పేపర్లను హైదరాబాద్‌, మరికొన్నింటిని నెల్లూరులో రాసినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. ఆ అభ్యర్థి పరీక్షలన్నీ హైదరాబాద్‌లోనే రాశారు. డిజిటల్‌ విధానంలో ప్రొఫెసర్లు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడంలో పొరపాట్లు జరగలేదు. మూల్యాంకనం విషయంలో అంతా గోప్యంగా జరిగింది. కమిషన్‌ ప్రమేయం అసలు ఉండదు. అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోవడం, తొలిసారి కావడంతో నెల రోజులకు బదులు మూల్యాంకనానికి 4 నెలల సమయం పట్టింది. గ్రూప్‌-3 పరీక్షలో రాణించలేని వారు గ్రూప్‌-1కి ఎంపికయ్యారు. సివిల్స్‌ రాసినవారు గ్రూపు-3కి కూడా ఎంపిక కాలేదు. అభ్యర్థుల సామర్థ్యంపై పరీక్ష రాసే నాటి పరిస్థితుల ప్రభావం కొంత ఉంటుంది. పలువురు అభ్యర్థులు జవాబుపత్రాల బుక్‌లెట్‌లను చూపించమని అడుగుతున్నారు. నియామకాల ప్రక్రియ పూర్తి కాకుండా అదెలా సాధ్యమవుతుంది. ఎంపికైన తర్వాత సబ్జెక్టుల వారీగా ప్రకటించే ఆ మార్కుల ఆధారంగా అభ్యర్థులు తమ ఫెర్మార్మెన్స్‌ను పరిశీలించుకోవచ్చు'.’ఏపీపీఏస్సీ సభ్యుడు సలాం బాబు

ఛైర్మన్‌ సభ్యుడే!

కమిషన్‌ ఛైర్మన్‌ హోదాలో ఉన్నా సభ్యుడితో సమానమని సలాం బాబు పేర్కొన్నారు. ‘కమిషన్‌ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఉదయ భాస్కర్‌ ఉన్నారు. ఆయనను ఆహ్వానిస్తున్నా వ్యక్తిగత కారణాలతో సమావేశాలకు హాజరవడం లేదు. దీంతో అభ్యర్థుల ప్రయోజనార్థం కమిషన్‌లోని మెజారిటీ సభ్యుల నిర్ణయాలను అమలు చేస్తున్నాం. గత ఏడాదిన్నరలో కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. తెదేపా నాయకుడు నారా లోకేశ్‌ తగిన ఆధారాలతో గ్రూప్‌-1 పరీక్షలపై ఫిర్యాదు చేస్తే కమిషన్‌ నివృత్తి చేస్తుంది’ అని సలాం బాబు స్పష్టం చేశారు.

గ్రూప్‌-1కు మినహా అన్నింటికీ ఇక ఒకే పరీక్ష!

గ్రూప్‌-1 మినహా గ్రూప్‌-2, ఇతర పరీక్షలకు ప్రిలిమ్స్‌ విధానాన్ని తొలగించి ఒకే పరీక్షను నిర్వహించాలని కమిషన్‌ ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీపీఏస్సీ సభ్యుడు సలాం బాబు వెల్లడించారు. ప్రిలిమ్స్‌ను తొలగించబోతున్నందున ఒకే పరీక్షను ఎలా నిర్వహించాలన్న దానిపై కమిషన్‌లో చర్చిస్తున్నామని, అధికారిక నిర్ణయం త్వరలో వెలువడుతుందన్నారు. పలువురు అభ్యర్థుల నుంచి వయోపరిమితిని 46/47 సంవత్సరాలకు పెంచాలని వినతులు వచ్చాయని సలాం బాబు తెలిపారు. ఈ నిర్ణయం ప్రభుత్వం పరిధిలో ఉందని, వయోపరిమితిని పెంచడం ద్వారా గతంలో ఎందరు లబ్ధి పొందారనే వివరాలను నోటిఫికేషన్ల వారీగా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

ఇదీ చూడండి.సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ

Last Updated : Jun 25, 2021, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details