AP Secretariat Employees Association : సుమారు లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుతంలోకి తీసుకోవడం సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం అని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అనేకమంది సచివాలయ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని కోరినా... సీఎం మాత్రం గౌరవ ప్రదంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారని కొనియాడారు. విశాఖలో నిర్వహించి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సచివాలయ ఉద్యోగుల సేవలు మర్చిపోలేనివి.. రాష్ట్ర ప్రభుతంలోకి 1.50 లక్షల మందిని ఉద్యోగులుగా తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పారు. కరోనా సమయంలో సచివాలయ ఉద్యోగుల సేవలు మర్చిపోలేనివని గుర్తు చేస్తూ.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు అందిస్తున్నారని చెప్పారు. ఒకటీ రెండు ఇబ్బందులు వస్తే బయటకి వచ్చి కొందరు నిరసనలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో అన్యాయం చేయరని చెప్పారు. కొత్త రిక్రూట్ మెంట్ జరగకుండానే సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరు ఏప్రిల్ లో బదిలీలు ఉండచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. కష్ట కాలంలో సీఎంకు ఉద్యోగులు అండగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి కోరారు.