దాదాపు 20 వేలకు పైగా అపార్ట్‌మెంట్‌లు ఉన్న విజయవాడ నగరంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివారిలో 50 శాతం మంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ... మిగిలినవారు కూడా జాగరూకతతో వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. స్వీయ నియంత్రణలో భాగంగా కొందరు తమ భవనాల్లోకి బయటవారు రాకుండా పూర్తిగా నియంత్రిస్తున్నారు. సంచారాన్ని పరిమితం చేయటానికి ఒక గేటు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు రెయిలింగ్ సాయం తీసుకోకపోవటం, లిఫ్ట్ వాడేటప్పుడు బటన్లు నొక్కటానికి గ్లౌజులు ధరించటం, లేదా మోచేతిని వాడటం లాంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచనలకు నగర వాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రతిరోజు అపార్ట్‌మెంట్ గేటుతో పాటు లిఫ్ట్ డోర్లు, మెట్ల రెయిలింగ్, మెట్లు తప్పనిసరిగా శుభ్రం చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో బయటకు వెళ్లినవారు మూడు రోజులు దాటితే తిరిగి లోపలికి రానివ్వట్లేదు. నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లి వచ్చేవారు గేటు వద్దే చేతులు శుభ్రం చేసుకుని లోపలికి వచ్చేలా చర్యలు చేపట్టారు. అపార్ట్‌మెంట్లలో తరచుగా కనిపించే పుట్టినరోజు, పెళ్లిరోజుల వంటి వేడుకలకు కొన్ని రోజులపాటు స్వస్తి చెప్పారు. ఇళ్లలోనే వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తున్నారు.పుస్తక పఠనం, సాయంత్రం వేళల్లో భౌతిక దూరం పాటిస్తూ చిన్నపాటి ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు.