ఈ ఏడు కాకుంటే వచ్చే సంవత్సరమైనా నాలుగురాళ్లు మిగలకపోతాయా అన్న ఆశతో అన్నదాతలు ఏటా సాగుకు సమాయత్తమవుతుంటారు. ప్రకృతి విపత్తుల కారణంగా గత కొన్నేళ్లుగా నష్టపోతూనే ఉన్నారు. ఈఏడాది కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆయా ప్రాంతాల అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం రైతుకు విత్తనం కావాలన్నా, ధాన్యం విక్రయించాలన్నా, పరిహారం అందాలన్నా పంట నమోదు తప్పనిసరి. నూరుశాతం పంట నమోదు లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ప్రస్తుతం పంటనష్టం నమోదుకు వెళ్తున్న రైతులకు ఈ పంటలో నమోదు కాలేదని చెప్పడంతో ఆవేదన చెందుతున్నారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 2.48లక్షల హెక్టార్లలో వరి పంట సాగయ్యింది.వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. దీనిలో భాగంగానే పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. నమోదుకోసం పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని రైతుభరోసా కేంద్రాలకు వెళ్లిన రైతులు పంట నమోదు కాలేదని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సంయుక్త అజమాయిషీ విధానంలో పంట నమోదు చేసేందుకు వీఆర్వో, గ్రామ సర్వేయర్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ, పశుసంవర్థక సహాయకులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎప్పటి పంటలు అప్పుడు నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంత చేసినా పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో చాలామంది రైతుల పంటలు నమోదు కాలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు ఏమి చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
ఎరువులు కావాలన్నా, ఇతర సేవలు పొందాలన్నా, పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నా, బీమా పరిహారం అందాలన్నా పంట నమోదు తప్పని సరి. భూమి అడంగళ్లలో సమస్యలు, సాంకేతిక లోపాలు తదితర కారణాలతో జిల్లాలో వేలాదిమంది రైతుల పంటలు నమోదు కాలేదు. గ్రామాల్లో ఉండే వ్యవసాయ సహాయకులతోపాటు అనుబంధ శాఖల సిబ్బంది వారి పరిధిలోని పొలాలకు వెళ్లి ఏపంట సాగు చేశారో చిత్రాలు తీసి దస్తావేజుల వివరాలతో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈవిషయంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతోపాటు అధికారులు ఆ దిశగా విస్తృత ప్రచారం చేయకపోవడంతో చాలామంది రైతులు పంట నమోదు చేసుకోలేక పోయారు. మళ్లీ నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని ఆయా రైతులు కోరుతున్నారు.
'నమోదు కాలేదని చెప్పారు'
నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేస్తున్నారని భూమి పత్రాలు తీసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్లాను. తీరా అక్కడకు వెళ్లిన తరువాత సిబ్బంది పంట నమోదు కాలేదని చెప్పారు. నాకు రెండెకరాల పొలం ఉంది. సమస్యను అధికారులకు కూడా చెప్పాను. నాలాంటి రైతులు మా గ్రామంలోనే 100మంది వరకు ఉంటారు. మాకు ఏంచేయాలో తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పంట నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.- రామయ్య, మల్లవోలు, గూడూరు మండలం
ఎవరూ రాలేదు