ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత హత్య...! - ఎక్స్ ప్రెస్ టీవీ
ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హత్య గురై ఉండొచ్చని పోలీసుల ప్రాథమికంగా నిర్థరించారు.
ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కృష్ణా జిల్లా కీసర వద్ద కారులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విచారించిన పోలీసులు ఆ మృతదేహం... జయరామ్దిగా గుర్తించారు. ఆయన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీగా ఉన్నారు. కొన్నేళ్లుగా ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. టీవీ ఛానల్ నడుపుతున్న క్రమంలో కొన్ని అవతకవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల్లో భాగస్వామి భానుతోనూ విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
తల్లి చనిపోయిన తర్వాత కుటుంబంలోనూ కలహాలు వచ్చినట్టు సన్నిహితులు చెబుతున్నారు. చెల్లి సూసుతోనూ గొడవులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కారణాలతో ఆయన అనుమానాస్పద మృతి అనేక సందేహాలకు కలిగిస్తోంది.
జయరామ్ కుటుంబం అమెరికాలో నివాసం ఉంటోంది. ఎక్స్‌ప్రెస్ టీవీని విక్రయించేందుకు మృతుడు జయరాం నెల రోజుల క్రితమే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి దస్పల్లా హోటల్‌కు వెళ్లినట్లు... అక్కడి నుంచి కారులో విజయవాడ వెళ్లినట్లు వాచ్మెన్ చెప్పారు.
ఒంటరిగా వెళ్లారని వాచ్మెన్ చెబుతున్నప్పటికీ... ఆయన కారులో ఇంకెవరో ఉన్నట్టు టోల్ గేట్ వద్ద సీసీ ఫుటెజ్ నిర్దరిస్తోంది. పంతంగి వద్ద టోల్ ఫీజును డ్రైవింగ్ సీట్లో ఉన్న మరో వ్యక్తి చెల్లించినట్టు సీసీ కెమెరాల్లో దృశ్యాలుచెబుతున్నాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన హత్యకు కారణమెవరు.... ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారా... లేకుంటే కారులోనే హతమార్చా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కారులో మద్యం సీసాలు లభించాయి. అన్నింటినీ పోలీసులు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.