ఈవీఎంల లోపాలపై చర్చించేందుకు తెదేపా తరఫున హాజరైన సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్‌ని ఈసీ అనుమతించకపోవడంపై తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. హరి ప్రసాద్‌పై గతంలో ఈవీఎం చోరి ఉన్నందున ఆయనతో చర్చలు జరపమని పేర్కొంటూ తెదేపాకు ఈసీ లేఖ పంపగా... దీనిపై తెదేపా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ బదులిచ్చారు. 9 ఏళ్ల క్రితం హరిప్రసాద్‌పై ఈవీఎం అపహరణ ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు కనీసం ఛార్జిషీట్ కూడా నమోదు చేయలేదన్న విషయాన్ని గుర్తించాలని లేఖలో సూచించారు.
సాకులు చెప్పకండి... హరిప్రసాద్నే అనుమతించండి : కనకమేడల - hari prasad
ఈవీఎంల పనితీరుపై చర్చించేందుకు తెదేపా తరఫున హరిప్రసాద్ హాజరవ్వడంపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెదేపాకు లేఖ రాసింది. ఆయనపై ఈవీఎం చోరీ కేసు నమోదైందని.. దీని దృష్ట్యా ఆయనతో చర్చించబోమని చెప్పింది. ఈ లేఖపై తెదేపా స్పందిస్తూ... ఆయన్నే అనుమించాలంటూ ఈసీకి మూడు పేజీల లేఖ రాసింది.
ప్రతిష్ఠాత్మక అవార్డు గ్రహీత
"అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు హరిప్రసాద్. భద్రతా పరిశోధకుడిగా ఆయన ఈవీఎంల లోపాలను బయటపెట్టారు. ఈవీఎంలపై పరిశోధన చేసిన తొలి వ్యక్తి హరిప్రసాద్ అనే విషయం మరిచిపోరాదు" అని తెదేపా సూచించింది. 2011 జులై 21న ఈసీ తొలిసారి చేపట్టిన వీవీ ప్యాట్ ప్రయోగానికి హాజరు కావాలని హరిప్రసాద్‌ని కేంద్ర ఎన్నికల సంఘం 2011 జులై 16న ఆహ్వానించిన విషయాన్ని అధికారులకు తెలియజేసింది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కాపీని లేఖతో పాటు ఎన్నికల సంఘానికి పంపింది. ఈ విషయాలు అన్నీ ఎన్నికల సంఘం రికార్డుల్లో ఉన్నాయని... అవసరం అయితే రికార్డులను తిరగెసుకోవాలని తెదేపా సూచించింది. అసలు విషయాన్ని చర్చించకుండా తప్పించుకోవడానికే ఇటువంటి సాకులు చూపుతున్నారని తెదేపా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ లేఖలో పేర్కొన్నారు. 'ఒక సాంకేతిక నిపుణుడిగా... హరిప్రసాద్ లేవనెత్తిన అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని... సోమవారం ఎన్నికల సంఘం సాంకేతిక కమిటీ సభ్యులు సుదీప్ జైన్, ప్రొఫెసర్ సహానీతో చర్చించేందుకు అవకాశం కల్పించాలి' అని తెదేపా కోరింది.