పర్యటక కార్యకలాపాలకు రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్, ఫెసిలిటేషన్ పేరిట మార్గదర్శకాలు ఇచ్చింది. పర్యటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ ఆదేశాలను జారీ చేశారు. టూరిజం ఆపరేటర్ల రిజిస్ట్రేషన్‌కు యంత్రాంగం లేక గణాంకాల నమోదులో ఇబ్బంది ఉందని.. నిర్దిష్ట వ్యవస్థ ఏర్పాటుకు మార్గదర్శకాలు ఇచ్చింది ప్రభుత్వం. పర్యటక గణాంకాలు, వివరాలకు రిజిస్ట్రేషన్లు అవసరమన్న ప్రభుత్వం.. టూరిజం సర్వీస్ ప్రొవైడర్ల రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు విడుదల చేసింది. గోవా సహా పలు రాష్ట్రాల మాదిరిగా రిజిస్ట్రేషన్ ఉంటుందని స్పష్టీకరణ చేసింది. సేవలు అత్యుత్తమంగా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
పర్యటకాన్ని ప్రోత్సహించేలా మార్కెటింగ్ వ్యవస్థకు రూపకల్పన చేయాలని సూచనలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పేలా కార్యాచరణ రూపొందిస్తోంది. పర్యటక సేవల్ని వ్యవస్థీకరించేలా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించే సర్వీసు ప్రొవైడర్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించనుంది. సెల్ప్ డిక్లరేషన్ తరహాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందన్న ప్రభుత్వం.. మార్గదర్శకాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.