ap teacher unions: పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి 34 ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. పీఆర్సీలోని అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందాలను వ్యతిరేకించారు. ఫిట్‌మెంట్ 27% కంటే ఎక్కువ ఇవ్వాలని, గ్రాట్యుటీని 2020 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని, సీపీఎస్ రద్దు, ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండు చేశారు. పీఆర్సీ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి మార్చి 8వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. పీఆర్సీపై ఉద్యోగుల అసంతృప్తిని తెలుసుకునేందుకు బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. మార్చి 2, 3 తేదీల్లో జిల్లా స్థాయి, 7, 8 తేదీల్లో రాష్ట్రస్థాయిలో రిలే దీక్షలు చేపట్టనున్నారు.
పెద్దఎత్తున ఉద్యమం
‘పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఐక్యవేదిక ఉద్యమానికి ఏడుగురు పీడీఎఫ్, స్వతంత్ర ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. సీఎం జగన్ చర్చలకు పిలిచి, డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. రాష్ట్రస్థాయిలో పెద్దఎత్తున నెలరోజులు ఉద్యమాన్ని నిర్వహించనున్నాం. సీపీఎస్‌పై రోడ్‌మ్యాప్ కాదు.. రద్దుచేయాలి. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. పోలీసు ఆంక్షలు, నిర్బంధం ఉన్నా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం. పదవీవిరమణ వయసు పెంపును రద్దు చేస్తే స్వాగతిస్తాం.’
- ఫ్యాప్టో అధ్యక్షుడు సుధీర్‌బాబు
ఫిట్‌మెంట్‌పై చర్చించకుండా సఫలం ఎలా?
‘మంత్రుల కమిటీ ఫిట్‌మెంట్‌పై చర్చించకుండానే చర్చలు సఫలమైనట్లు ప్రకటించింది. పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవు. ప్రభుత్వంపై పీఆర్సీపై పునఃసమీక్షించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఎన్ని ఆంక్షలు విధించినా ముందుకే వెళ్తాం.’
- ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర
నిర్బంధంతో ఏం సాధిస్తారు
‘ఉపాధ్యాయ సంఘాల కార్యాలయాల వద్ద పోలీసులను మోహరించారు. నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు. మాపై నిర్బంధం పెట్టి ఏం సాధిస్తారు? ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని గ్రహించినప్పుడు దాన్ని పరిష్కరించాలి. ప్రభుత్వం మాకు రాజకీయాలను అంటగట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలి.’
- యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
ఆ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు