AP Secretary of Energy Department: రాష్ట్రంలో గత 3-4 రోజులుగా విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయంగా అందిస్తున్నట్లు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. సాంకేతిక అవాంతరాల వల్ల కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రభుత్వం వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 204 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని... దానికి అనుగుణంగా బహిరంగమార్కెట్ నుంచి 30 మిలియన్ యూనిట్ల వరకూ కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల కనెక్షన్లకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అవాంతరాలు లేకుండా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ. 7 వేల 700 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 2020లో 4 లక్షల 36 వేల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని... 2021లో అవి 2 లక్షలకు దిగొచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాపిత ఉత్పత్తితో పాటు.. కేంద్రం, ప్రైవేటు ఒప్పందాల ద్వారా.... 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా వస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఇక అధిక డిమాండ్ ఉన్న సమయంలో అప్పటికప్పుడు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నట్ల ఇంధన శాఖ కార్యదర్శి వెల్లడించారు. ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండేందుకే 25 ఏళ్ల విద్యుత్ కాంట్రాక్టులు లేకుండా తాత్కాలికంగా కొనుగోళ్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
బకాయిల విషయంలో ఎలాంటి వివాదం లేదు
తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన బకాయిల విషయంలో ఎలాంటి వివాదం లేదని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉత్పన్నమైన రుసుము, పీపీఏ ఒప్పందం వల్ల తెలంగాణ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోందని తెలిపారు.