ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చర్చలకు కొత్త సంఘాలు రావాలని ఆహ్వానిస్తారా..? ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు? - ఏపీ వార్తలు

ap PRC Struggle committee
ap PRC Struggle committee

By

Published : Jan 27, 2022, 5:40 PM IST

Updated : Jan 28, 2022, 3:18 AM IST

17:35 January 27

ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు?: బొప్పరాజు

ap PRC Struggle committee: ఫిబ్రవరి 3న చలో విజయవాడకు లక్షలమంది తరలిరావాలని పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ నెలకు పాతజీతం ఇవ్వాలని కోరామని బండి శ్రీనివాస్‌ వెల్లడించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టడంతో పాటు.. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరామని గుర్తు చేశారు. తమ చిన్న కోరికలు తీర్చలేని కమిటీ .. డిమాండ్లు తీరుస్తుందా? అని ప్రశ్నించారు. తాము ప్రస్తావించిన 3 డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే చర్చలకు సిద్ధమన్నారు.

ఎన్ని సంఘాలను చీలుస్తారు..?

పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని బొప్పరాజు అన్నారు. చర్చలకు వెళ్లాలంటే తమ 3 కోరికలు తీర్చాలని అడిగామని.. కానీ మా లేఖకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదని స్పష్టం చేశారు. ప్రజలు, ఉద్యోగులకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఉద్యోగ సంఘాల నేతలే చర్చలకు రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. సజ్జల చుట్టూ మేం అనేకసార్లు తిరిగాం. 40 పాయింట్లపై సజ్జల గంటన్నరసేపు వివరంగా చర్చించారు. మాకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా? చర్చలకు కొత్త సంఘాలు కూడా రావాలని ఆహ్వానిస్తారా? ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు? మీ వద్దకు వచ్చిన 9 మంది ఉద్యోగ సంఘాల నేతలు కాదా?. లిఖితపూర్వక లేఖలకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. మా లేఖలకు ప్రభుత్వం జవాబిస్తేనే చర్చలకు వెళ్తాం" - బొప్పరాజు, అమరావతి జేఏసీ ఉద్యోగుల అధ్యక్షుడు

ట్రెజరీ ఉద్యోగులు కూడా తమలో భాగమే అన్నారు బొప్పరాజు. తమ కార్యాచరణలో భాగంగానే ట్రెజరీ ఉద్యోగుల నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ట్రెజరీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటే మమ్మల్ని రెచ్చగొట్టినట్లే అని హెచ్చరించారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. సప్లిమెంటరీ బిల్లులు రూ.18 కోట్లు వెంటనే ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.

చలో విజయవాడకు లక్షలాదిగా తరలిరండి: బండి శ్రీనివాసరావు
‘ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై 12 పర్యాయాలు చర్చలు జరిపి, చివరికి మేం చెప్పిన అంశాలను పట్టించుకోకుండానే ఉత్తర్వులు ఇచ్చేశారు. పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధుల బృందం సమర్పించిన వినతిపై మంత్రుల కమిటీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పాత జీతాలు ఇస్తామనో.. అశుతోష్‌మిశ్ర నివేదిక బయటపెడతామనో చెప్పని కమిటీ మిగతావాటిపై ఏం చేస్తుంది? మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లినా ఏం ఉపయోగం లేదు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు సిద్ధం. అన్ని జిల్లాల్లో ఉద్యమకార్యాచరణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 3న నిర్వహించనున్న చలో విజయవాడకు ఉద్యోగులు లక్షలాదిగా తరలిరావాలి’ అని వెల్లడించారు.

వారిపై ఒత్తిడి తొలగించేందుకే లేఖలు: వెంకట్రామిరెడ్డి
‘కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయాలని డీడీవో, ట్రెజరీ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. బిల్లులు చేయబోమంటే సమ్మె ఫిబ్రవరి ఆరు అర్ధరాత్రి నుంచి కదా.. ఇప్పుడెందుకు పని చేయరని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. డీడీవో, ట్రెజరీ అధికారులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు డీఏలతో కలిపి పాత జీతాలే ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించాం. చర్చలకు రమ్మని మంత్రుల కమిటీ పిలిస్తే స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధుల బృందాన్ని పంపించాం. ఆ బృందం మంత్రుల కమిటీని కలిసి గంటన్నరపాటు మాట్లాడింది. పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక బయటపెట్టాలని, జనవరికి పాత జీతాలివ్వాలని కోరింది. మంత్రుల కమిటీ వీటిపై ఏ నిర్ణయం తీసుకోకుండా చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఉద్యోగ సంఘాలు రావడం లేదని చెప్పడం ఎంతవరకు సబబు? ప్రభుత్వం పీఆర్సీపై పునరాలోచిస్తోందని అనుకోవాలంటే జనవరికి పాత జీతాలివ్వాలి. చర్చలపై గతంలోనే మా అభిప్రాయం చెప్పాం. వేరే సంఘాలతో చర్చించాలనుకుంటే చర్చించుకోవచ్చు’ అని అన్నారు.

రాష్ట్ర పీఆర్సీనా .. కేంద్ర పీఆర్సీనా - సూర్యనారాయణ

"మీరు అమలుచేసేది రాష్ట్ర పీఆర్‌సీనా.. కేంద్ర పీఆర్‌సీనా...? మంత్రుల కమిటీ తొలుత అయోమయం వీడాలి. ఉద్యోగులతో ప్రభుత్వం దోబూచులాట ఆడుతోంది. కేంద్రం 104 రకాల అలవెన్సులు ఇస్తోంది.. మీరూ ఇస్తారా. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. రికవరీ విధానం ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలి? పీఆర్సీ కమిటీ నివేదిక లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారు? మాకు మెచ్యూరిటీ లేదనే మాట ఉపసంహరించుకోవాలి. చర్చలు ఫలవంతం అయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలి" -సూర్యనారాయణ

లేఖలు అందజేత..

ఈ నెలకు పాత జీతమే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేతల కోరారు. ఈ మేరకు లేఖలు అందజేయాలని పిలుపునిచ్చారు. సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు.. తమ విజ్ఞప్తి లేఖలను డీడీవోలకు అందజేస్తున్నారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి కూడా పంచాయతీరాజ్ శాఖ డీడీవోకు లేఖను అందజేశారు.

మరో ప్రత్యామ్నాయం ఏముంది..? సజ్జల కీలక వ్యాఖ్యలు!

Sajjala Ramakrishna Reddy on Employees Protest: అంతకుముందు మీడియాతో మాట్లాడిన సజ్జల.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీపై ఉద్యోగుల అపోహలు తొలగించేందుకు మెట్టు దిగేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. చర్చల కోసం మంత్రుల కమిటీ సచివాలయంలో సిద్ధంగా ఉందన్న ఆయన.. రేపు కూడా అందుబాటులో ఉంటామని వెల్లడించారు. పీఆర్సీ సాధన సమితి, ఇతర సంఘాలు వచ్చినా అందుబాటులోనే ఉంటామని పేర్కొన్నారు.

ఉద్యోగుల డిమాండ్లను సీఎంతో చర్చించి పరిష్కరానికి ప్రయత్నిస్తామని సజ్జల తెలిపారు. ఉద్యోగుల ప్రతినిధులు వచ్చి చర్చిస్తేనే వారిపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ట్రెజరీ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘించటం క్రమశిక్షణారాహిత్యమని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం ఏముందన్నారు. దుందుడుకు వైఖరి, ఒంటెత్తు పోకడలతో వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..

Last Updated : Jan 28, 2022, 3:18 AM IST

ABOUT THE AUTHOR

...view details