రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఈ రీసర్వే ప్రక్రియను చేపట్టనున్నారు. రీసర్వే ప్రక్రియను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టేందుకు ఉద్దేశించిన బేస్ స్టేషన్ను నేడు ఉపముఖ్యమంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ ప్రారంభించనున్నారు. కార్స్ టెక్నాలజీ ద్వారా బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసి భూ సర్వే చేపట్టాలన్నది ప్రభుత్వం ఆలోచన. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.31 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేసేందుకు 65 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి రీసర్వే చేపట్టనున్నారు.
బ్రిటీష్ కాలం నాటి చట్టమే...
బ్రిటీష్ కాలంలోని సర్వే అండ్ బౌండరీస్ చట్టం 1923 ప్రకారం చేసిన సర్వే ఆధారంగానే ప్రస్తుతం కార్యకలాపాలు జరుగుతున్నాయి. జమాబంది పేరుతో 1990 వరకూ గ్రామీణ ప్రాంతాల భూముల వివరాలను నమోదు చేసినా.. ఆ తదుపరి భూ రికార్డులు అన్నీ తప్పుల తడకగా మారటంతో రీసర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్స్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు భూకమతాల వైశాల్యాన్ని నిర్దేశించి నమోదు చేయొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలోనూ ఇదే సాంకేతికతను వినియోగించి... 77 చొప్పున బేస్స్టేషన్లు ఏర్పాటు చేసుకుని సర్వే ప్రక్రియ చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో విమానాల ద్వారా సర్వే చేపట్టేందుకు ప్రయత్నించినా సఫలం కాకపోవటంతో ప్రభుత్వం ఈ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. క్రాస్ సాంకేతికత ద్వారా ఉపగ్రహ ఛాయాచిత్రాలు, జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా చేపట్టనున్నారు. రీసర్వే ప్రక్రియ అనంతరం రీసర్వే రిజిస్టర్ను రూపొందించనున్నారు.