కృష్ణాజిల్లా పరిటాల గ్రామ పరిధిలో స్టోన్ క్రషర్స్ నిర్వాహకులు ఇబ్రహీంపట్నం మెయిన్ కాలువను పూడ్చేసి అడ్డంగా 17 చోట్ల కట్టలు ఏర్పాటు చేసుకుంటుంటే... అధికారులు ఏమి చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నిద్రపోతున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇంత తీవ్ర నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించింది. ఒకవేళ చర్యలు తీసుకొని ఉంటే ఆ వివరాల్ని అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొండపల్లి అటవీ ప్రాంత భూమిని ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పలువురు.. వారి కార్యకలాపాలు కొనసాగించడం కోసం పరిటాల గ్రామ పరిధిలోని 8.6 కి.మీ పరిధి వరకు ఇబ్రహీంపట్నం మెయిన్ కాలువను కనుమరుగు చేశారని ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. కాలువను ధ్వంసం చేశారని... కాలువను పూడ్చి రవాణాకు అనువుగా రహదారి ఏర్పాటు చేసుకున్నారన్నారు.