రాష్ట్ర ప్రభుత్వం 34 వేల 890 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకుంది. వచ్చే మంగళవారం సెక్యూరిటీల వేలంలో పాల్గొని మరో 2వేల కోట్లు తీసుకునేందుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మొత్తం కలిపితే బహిరంగ మార్కెట్ రుణం 36 వేల890 కోట్లకు చేరుతుంది. ఇవికాకుండా బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా 8 వేల 305 కోట్లు సమీకరించింది. దీంతో కలిపి మొత్తం 45 వేల 195 కోట్లు తీసుకున్నట్లు అవుతుంది. వీటితోపాటు నాబార్డు, కేంద్రం ఇచ్చిన అప్పులూ ఉన్నాయి. ఇవికాకుండా బహిరంగ మార్కెట్ నుంచి మరో 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర అధికారులు కేంద్ర ఆర్థికశాఖను దిల్లీకి వెళ్లి అభ్యర్థించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిబెంచర్లను వేలం వేసి మరో 25 వేల కోట్లు సమీకరించేందుకు ఆర్బీఐ అనుమతికి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా బెవరేజెస్ కార్పొరేషన్ అంశం కేంద్రంలో చర్చనీయాంశమైంది.
బహిరంగ మార్కెట్ నుంచి 43 వేల 803 కోట్లు తొలి తొమ్మిది నెలల్లో తీసుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది. కానీ ఆగస్టు 16 వరకు తీసుకున్న రుణం 34 వేల 890 కోట్లు. అదే సమయంలో రాష్ట్ర ఆదాయాన్ని కార్పొరేషన్లకు మళ్లించి, ఆ మొత్తాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు కూడా ప్రభుత్వ అప్పులేనని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 8 వేల500 కోట్ల రుణం తీసుకున్నారు. దీన్ని తీసుకునేందుకు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై వ్యాట్ వసూలు చేసేది. ఆ మొత్తాన్ని తగ్గించింది. అంతే మేరకు బెవరేజెస్ కార్పొరేషన్ సొంతంగా సుంకం విధించి వసూలు చేసుకునేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది. దీనివల్ల ఒకవైపు రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. మరోవైపు అదే ఆదాయంతో అదనపు అప్పు తెచ్చుకునే అవకాశాన్ని సృష్టించింది. కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసిన ప్రకారం ఇది కూడా రాష్ట్ర అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఆ కోణంలో చూస్తే ఇప్పటికే రాష్ట్ర బహిరంగ మార్కెట్ రుణ పరిమితి స్థాయికి 5 నెలల్లోనే చేరిపోయింది. కొత్తగా రుణాలు తీసుకోవడానికి అనుమతివ్వాలని దిల్లీలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు అపరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అప్పు ఎక్కడ, ఎలా దొరుకుతుంది
ఎడాపెడా అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా సందేహించడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ నియంత్రణ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి 43 వేల 803 కోట్లను బహిరంగ మార్కెట్ నుంచి రుణం స్వీకరించేందుకు అనుమతిచ్చింది. అయితే గడువులోని తొలి అయిదు నెలలు పూర్తికాకుండానే దాదాపు పరిమితి మేరకు అప్పులు తీసుకోవడంతో ఇప్పుడు కొత్త అప్పుల కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
appu