ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హై రిస్క్ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గతంలో తెలంగాణ, కర్ణాటకను లోరిస్క్ ప్రాంతాలుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అయితే అక్కడ కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో హై రిస్క్ ప్రాంతాలుగా మార్చింది.
ఏపీ క్వారంటైన్ విధానంలో మార్పులు ఇవీ...
- విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం విధించే ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి.
- గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉన్న 14 రోజుల క్వారంటైన్ ఏడు రోజులకు కుదింపు.
- విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారికి ఐదో రోజు, ఏడో రోజు కొవిడ్ టెస్టు చేయాలి.
- దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల నుంచి 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టు చేయాలి.
- విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాలి. ఆ తర్వాత వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలి.
- రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా టెస్టులు చేయాలి. వారికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి.
- రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు చేయాలి.
- తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి.
- ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఈ- పాస్‌కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందే.
- రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు చేసి కొవిడ్ ఆస్పత్రులకు తరలించాలి.
- హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు వాలంటీర్, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి.