రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యవేదికకు.. ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఆదివారం నాలుగు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో అన్నింటికన్నా కీలకమైన ఐఆర్ రికవరీ లేకుండా చేసే ఉత్తర్వులు మాత్రం ఇంకా విడుదల కాలేదు. 2019 జులై నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు 27% చొప్పున ఇచ్చిన మధ్యంతర భృతిని రికవరీ చేస్తున్నట్లు గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. డీఏ బకాయిల నుంచి ఐఆర్ మొత్తం రికవరీ ఉండబోదని మంత్రుల కమిటీ మినిట్స్‌లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఆదివారం రాలేదు. దీనిపై ఆర్థికశాఖ అధికారులను సంప్రదిస్తే ఈ ఉత్తర్వులు భవిష్యత్తులో వస్తాయన్నారు. ఎప్పుడనేది స్పష్టత ఇవ్వలేదు. పీఆర్సీ అమలు నిరంతర ప్రక్రియ అని, వాటికి సంబంధించిన ఉత్తర్వులు నెలల తరబడి వస్తూనే ఉంటాయని తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబరు వరకు స్కేళ్లు లెక్కగట్టి రికవరీ లేనందున సర్దుబాటు ప్రక్రియను మార్చి ఉద్యోగులకు డీఏ బకాయిలు ఎంత మొత్తం రావాలో తేల్చాల్సి ఉంది. ఆ బకాయిలు పదవీవిరమణ తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగికి రావాల్సిన మొత్తం ఎంత? పదవీవిరమణ తర్వాత ఎంత వడ్డీతో ఎంత చెల్లిస్తారో స్పష్టత కావాలని ఉద్యోగులు అంటున్నారు.
1. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లో మార్పులు
ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను మారుస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తాయంది.
*దీనివల్ల జనవరి 17న ఇచ్చిన కొత్త పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఎంత కోత పెట్టారో ఆ మొత్తం 1.4.2020 నుంచి 31.12.2021 వరకు వర్తింపజేస్తోంది. ఆ సమయంలో ఆర్థిక ప్రయోజనం లెక్కకట్టేందుకు స్కేళ్లు లెక్కలోకి తీసుకున్న పరిస్థితుల్లో కోత పెట్టిన శ్లాబుల ప్రకారమే వర్తింపజేస్తారు. ఆ 21 నెలలు ఇప్పటికే పాత శ్లాబుల ప్రకారం ఉద్యోగులు డ్రా చేశారు. బకాయిల సర్దుబాటు సమయంలో ఈ మేరకు తాము నష్టపోతున్నట్లేనని, ఆ 21 నెలల నష్టం అలా సశేషంగా ఉందని చెబుతున్నారు.
2. సీసీఏ పాత శ్లాబుల కొనసాగింపు- 2022 జనవరి నుంచి వర్తింపు
2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు సీసీఏ తొలగించినట్లే అవుతుంది. ఇప్పటికే ఆ మొత్తాలు డ్రా చేశారు. ఆర్థిక ప్రయోజనం లెక్కకట్టి బకాయిలు తేల్చే క్రమంలో ఇదంతా సర్దుబాటు చేయాల్సి వస్తుందని, దానివల్ల 21 నెలల ప్రయోజనాన్ని నష్టపోయినట్లేనని పేర్కొంటున్నారు.
3. ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించారు. ఇప్పటికే 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు 27% చొప్పున డ్రా చేశారు. 2020 ఏప్రిల్ నుంచి కొత్త మూల వేతనంతో కలిపి లెక్కించడం వల్ల, డీఏలు జత చేయడం వల్ల మొత్తం మీద పొందే జీతం పెరిగినా.. బకాయిలు లెక్కకట్టే క్రమంలో ఈ 21 నెలల కాలానికి తగ్గిన ఫిట్‌మెంట్ రూపంలో నష్టపోతున్నామని చెబుతున్నారు.