ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Govt: ధాన్యం కొనుగోళ్లకు సహకార కార్పొరేషన్.. ఏర్పాటు దిశగా కసరత్తు! - ఏపీలో సహకార కార్పొరేషన్

ధాన్యం కొనుగోళ్ల కోసం మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పౌరసరఫరాల కార్పొరేషన్ పై రుణభారం పెరిగిపోవటంతో ధాన్యం సేకరణకు మరో సంస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. రైతుల భాగస్వామ్యంతోనే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా.. మిల్లర్ల నుంచి రైతులకు రక్షణ లభిస్తుందని సర్కార్ భావిస్తోంది. రైతులకు కనీస మద్ధతు ధర అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఉపకరిస్తుందన్నది సర్కార్ ఆలోచన.

ఏపీలో ధాన్యం సేకరణ
paddy procurement in ap

By

Published : Aug 21, 2021, 10:12 PM IST

రాష్ట్రంలో మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ధాన్యం సేకరణ కోసం సహకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతుల భాగస్వామ్యంతోనే ఈ సహకార కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో దళారుల పాత్ర తగ్గించటంతో పాటు మిల్లర్లతో సంబంధం లేకుండా ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది.

మిల్లర్ల దొపిడీకి చెక్..!

రైతులకు మరింత మేలు కలిగించేలా సహకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. తద్వార మిల్లర్ల దోపిడీకి చెక్ చెప్పే అవకాశముందని భావిస్తున్నారు. కొత్త కార్పొరేషన్ ఏర్పాటైతే ఇక నుంచి సదరు సంస్థ నుంచే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ ద్వారా రుణ వెసులుబాటు కూడా కలుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పై దాదాపు 25 వేల కోట్ల రుణ భారం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సాధ్యాసాధ్యాలపై కసరత్తు..!

మిల్లర్ల ప్రమేయం లేకుండా ధాన్యం సేకరణ సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ ధాన్యాన్ని మళ్లీ మిల్లింగ్ చేసేందుకు రైస్ మిల్లులకు తరలించాల్సిన పరిస్థితి ఉంది. ధాన్యం మిల్లింగ్ తో పాటు నిల్వ, రవాణా వంటి అంశాలు మిల్లర్ల పర్యవేక్షణలోనే ఉండేవి. రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణతో ఈ వ్యవస్థ అంతా తారుమారైంది. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేంత వరకూ ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలన్నది రైతులకు పెద్ద సమస్యగా తయారైంది.

గతంలో కల్లం నుంచి నేరుగా రైస్ మిల్లుకు తరలిస్తే విక్రయం లేదా ఎఫ్​సీఐ సేకరణ వరకూ రైస్ మిల్లర్లే నిల్వ చేసి తరలించే పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం మారిపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పౌరసరఫరాల కార్పొరేషన్ పై భారీగా రుణభారం ఉండటంతో సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలుకు యత్నిస్తోందని తెలుస్తోంది.

ఇదీ చదవండి:

అఫ్గానిస్థాన్‌లో ఆంధ్రుల కోసం.. విజ‌య‌వాడ‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్!

ABOUT THE AUTHOR

...view details