రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించేందుకు కార్లు, జీపులకు కిలోమీటర్‌కు 90 పైసలు, సరకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు, మినీ బస్సులకు రూపాయి 80 పైసలు, బస్సు, లారీలకు 3 రూపాయల 55 పైసలు, భారీ వాహనాలకు 8 రూపాయల 90 చొప్పున టోల్ ఫీజులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో పలు రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయమై గతంలో ఉన్న నిబంధనలను మారుస్తూ.. ప్రభుత్వం గురువారం తాజా ఉత్తర్వులను జారీచేసింది. రాష్ట్ర రహదారులు, బైపాస్‌లు, వంతెనలు, సొరంగాల పరిధిలో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి, ఫీజుల వసూలుకు 2019-20 సంవత్సర మూల ధరలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ఫీజులు అమల్లోకి వస్తాయన్నారు. రూ.20-25 కోట్లతో నిర్మించిన వంతెనలు, సొరంగాల వద్ద కార్లు, జీపులకు రూ.9, తేలికపాటి సరకు రవాణా వాహనాలకు రూ.13.50, బస్సు, లారీలకు రూ.27, భారీ వాహనాలకు రూ.39.60 చొప్పున ఖరారు చేశారు. నిర్మాణ వ్యయం రూ.25 కోట్లు దాటితే.. ప్రతి రూ.5 కోట్లకు ధర పెరుగుతుంది. ఏటా ఈ టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. ఫాస్టాగ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ వాహనాలకు టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేక లేన్ అందుబాటులోకి తెస్తారు.