ఎంసెట్ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి సహాయ కేంద్రానికి ఫోన్లు, అధికారులకు ఈ-మెయిళ్లు వెల్లువలా వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి శనివారం సుదీర్ఘంగా ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. సోమవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని తీసుకోవాలని భావించారు. ఈలోగా పరీక్ష నిర్వహణకు అవసరమైన సన్నద్ధతపై కన్వీనర్లు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ వారికి సూచించారు.
ఏపీ ఎంసెట్‌ను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 2.71 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరికి మొదట 167 పరీక్ష కేంద్రాలను కేటాయించగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 146కు తగ్గింది. విద్యాసంస్థలు మూతపడటంతో విజయవాడలో ఇంటర్ చదివిన చాలామంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించటంతో విజయవాడకు బదులు సొంత జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల విజయవాడలో పరీక్ష కేంద్రాల సంఖ్య తగ్గి, జిల్లాల్లో పెరిగాయి. సుమారు 15 వేల మంది ఇలా మార్చుకున్నవారిలో ఉన్నారు.
అక్కడ పరీక్ష ఎలా?