ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ఆర్​బీకేలు: ప్రభుత్వం

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖరీఫ్ సీజన్‌ మార్కెటింగ్ విధానాన్ని గురువారం ప్రకటించింది. ఈ-క్రాప్​లో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం సేకరిస్తామని స్పష్టం చేసింది.

rythu bharosa kendralu
rythu bharosa kendralu

By

Published : Oct 29, 2020, 8:46 PM IST

ఖరీఫ్ సీజన్‌ మార్కెటింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. డ్వాక్రా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు, రైతుమిత్రలు... ధాన్యం సేకరిస్తారని చెప్పింది. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోనె సంచులు ఉంచాలని అధికారులను ఆదేశించింది. గోనె సంచులు, ఇతర సామగ్రి బాధ్యతలు సివిల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. వీటితో పాటు ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాల్లో వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వరి సాధారణం రూ.18,680, వరి మేలు రకానికి రూ.18,880గా ధర నిర్ణయించింది. రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యం సేకరణ 4 శాతానికి మించకూడదని ఆదేశించింది. అలాగే ధాన్యం కొనుగోళ్లల్లో ఫిర్యాదుల పరిష్కారానికి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది.

ఈ-క్రాప్​లో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల పండించిన పంట వివరాలను ఈ-క్రాప్​లో నమోదు చేసే బాధ్యత వీఏఏలకు అప్పగించింది. ఓ రైతు పేరు మీద 25 ఎకరాల్లో పండించిన పంట వివరాలను మాత్రమే ఈ-క్రాప్​లో నమోదు చేసుకోవాలని వీఏఏలకు స్పష్టం చేసింది. మెట్రిక్ టన్నుకు రూ.600 మేర మిల్లర్లకు సోర్టెక్స్ ఛార్జీలు, ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం సరఫరా చేసే మిల్లర్లకు మెట్రిక్ టన్నుకు మిల్లింగ్ నిమిత్తం రూ.500 చెల్లిస్తామని వెల్లడించింది. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీ-ఫైన్ చేసే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details