APGEA SuryaNarayana Petition : ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ను కలిసిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వద్దకు ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర స్పందిస్తూ.. ప్రస్తుత వ్యాజ్యం సర్వీసు వ్యవహారానికి సంబంధించినదని భావించి హైకోర్టు రిజిస్ట్రీ.. రోష్టర్‌కు భిన్నంగా ఈ బెంచ్ వద్దకు వ్యాజ్యాన్ని విచారణకు వేసిందన్నారు. వాస్తవానికి ఈ వ్యాజ్యం సర్వీసు సంబంధ విషయం కాదన్నారు.
ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చూడాలంటూ గవర్నర్ను కలిసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23న షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే పిటీషనర్ సంఘం గుర్తింపును రద్దు చేస్తామని పేర్కొన్నారన్నారు. అత్యవసరం ఉన్న నేపథ్యంలో మంగళవారం ఈ వ్యాజ్యం తగిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర ప్రయోజనాల చెల్లింపులో తరచూ జాప్యం జరుగుతోందని... అధికరణ 72, 1990 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకు ఇలాంటి చర్యలు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.