ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాజధాని రైతులు ఏడాదిగా పోరాడుతున్నారని.. వారిపై పోలీసుల తీరును ఖండించారు. వైకాపా నాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నామని చెప్పి.. నేడు మూడు రాజధానులు అని మాటమార్చి మోసం చేస్తోందిని ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవరావు అన్నారు. రైతులను రెచ్చగొట్టేలా రాజధాని అమరావతిలో పోటీ ధర్నాలు చేయించడం దారుణమన్నారు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు.
రాజధాని రైతులపై పెట్టిన కేసులు తొలగించాలి: ఏపీ రైతు సంఘం
అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమంపై పోలీసుల తీరు దారుణమని ఏపీ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. వారిపై పెట్టిన కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు.
రాజధానికై ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్ అయినా.. తప్పు సరిదిద్దుకోకపోగా తిరిగి ఎస్సీ, ఎస్టీ చట్టాలను వారిపైనే ఉపయోగించడం దారుణమన్నారు. అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. తక్షణమే వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ 9న డీజీపీని కలుస్తామన్నారు. నవంబర్ 10 , 11 తేదీల్లో రాజధాని రైతులకు మద్దతు పలుకుతామన్నారు. రైతు సంఘాలతో కలిసి దిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలిసి అమరావతి కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.
ఇదీ చదవండి:ఏలూరులో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన