cm ys jagan: ప్రభుత్వం.. ఉద్యోగులదనే విషయం గుర్తించాలని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో మాట్లాడిన సీఎం.. ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగల్గుతామని చెప్పారు. కొవిడ్, ఆర్థిక పరిస్థితుల్లోనూ చేయగల్గినంత చేశామని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చన్నారు. మంత్రుల కమిటీ నిర్ణయాలు సంతోషాన్ని ఇచ్చాయని భావిస్తున్నానని తెలిపారు.
కొవిడ్, ఆర్థిక పరిస్థితుల్లోనూ చేయగల్గినంత చేశాం : ముఖ్యమంత్రి జగన్ "ఐఆర్ సర్దుబాటు వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్లు, హెచ్‌ఆర్‌ఏ వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.325 కోట్ల భారం పడనుంది. మార్పు చేసిన హెచ్‌ఆర్‌ఏ వల్ల ప్రభుత్వంపై రూ.800 కోట్లు, అదనపు క్వాంటం ఆఫ్ పింఛన్ వల్ల రూ.450 కోట్లు, సీసీఏ వల్ల మరో రూ.80 కోట్లు, కొత్త పీఆర్సీ వల్ల ఏటా ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల భారం పడుతుంది. ఉద్యోగుల ఇతర ప్రయోజనాలకు అదనంగా రూ.1,330 కోట్ల వ్యయం అవుతాయి" -ముఖ్యమంత్రి జగన్
సీపీఎస్‌పై అధ్యయనం చేస్తున్నాం..
'సీపీఎస్‌పై గట్టిగా పనిచేస్తున్నాం. వివరాలన్నీ ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను. మిమ్మల్నందర్నీ అందులో మమేకం చేస్తాను. కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పింఛను మంచిగా పెరిగేలా చూస్తాను. గతంలో ఎవరూ చేయని విధంగా ఉద్యోగికి జగన్ మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. పదవీ విరమణ తర్వాత కూడా మంచి జరగాలని ఆలోచిస్తున్నా. సీపీఎస్‌లో ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నాం. ఒప్పంద ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వనున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తాం. సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. మున్ముందు ఇవన్నీ మంచి ఫలితాలనిస్తాయి. అందరం కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం.
నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు
నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. మీరు లేకపోతే నేను లేను. మీ వల్లే అనేక పథకాలను పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు అందివ్వగలుగుతున్నాను. దయచేసి భావోద్వేగాలకు తావివ్వకండి. ఎక్కడైనా తక్కువ చేస్తున్నామని అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. 24 నెలలు జీతం రూపేణా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని గుర్తుంచుకోండి. ఏ సమస్యపైనైనా చర్చించేందుకు, మీరు చెప్పేవి వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చర్చల ద్వారా పరిష్కారం కానప్పుడు మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు' అని జగన్ అన్నారు.
ap employees steering committee: సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితుల వల్ల అనుకున్నంత ఇవ్వలేకపోతున్నట్లు సీఎం చెప్పారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, అదనపు క్వాంటం ఆఫ్ పింఛన్లపై స్పష్టత ఇచ్చారని వివరించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు విషయంపై కూడా వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీతో ప్రతి నెలా భేటీ నిర్వహిస్తామని అన్నారు.
ఉద్యమం వరకు వెళ్లొద్దని చెప్పారు : బొప్పరాజు
"సమస్యలుంటే ఉద్యమం వరకు వెళ్లవద్దని సీఎం చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీని కొనసాగిస్తామని చెప్పారు. సమస్యలపై భవిష్యత్ లో మంత్రుల కమిటీతో చర్చించాలని చెప్పారు. ప్రతినెలా ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతామన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగైతే భవిష్యత్‌లో మరింత లబ్ధి చేస్తామన్నారు" - బొప్పరాజు, అమరావతి జేఏసీ అధ్యక్షుడు
జీతం తగ్గదు - వెంకట్రామిరెడ్డి
ఉద్యోగుల మద్దతుతో ప్రభుత్వం నుంచి సానుకూల ఫలితాలు రాబట్టగలిగామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్ తప్ప మిగతా అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. వెంటనే ఆర్థిక లబ్ధి చేకూరకపోయినా పీఆర్సీ సాధించుకున్నామన్నారు. పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి పీఆర్సీ సాధించుకోగలిగామన్న ఆయన.. ఒక్క శాతం తప్ప తెలంగాణతో సమానంగా హెచ్‌ఆర్‌ఏ సాధించుకున్నామని వెల్లడించారు. మార్చిన హెచ్‌ఆర్‌ఏ వల్ల కొత్త పీఆర్సీ ప్రకారం జీతం తగ్గదని స్పష్టం చేసారు.
31లోగా రోడ్ మ్యాప్ ప్రకటన - సూర్యనారాయణ
"ఉద్యోగుల ఫిట్‌మెంట్ విషయంలో పట్టుబట్టాం. ఉద్యోగులు కోరిన విధంగా ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఇవ్వలేదు.ఉద్యోగుల డిమాండ్లలో కొంతమేర వెసులుబాటు ఇచ్చారు. ఒకశాతం తేడాతో తెలంగాణ మాదిరిగా హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఇచ్చారు. 3 ప్రధాన అంశాలు లక్షలాది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ప్రధాన అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఫిట్‌మెంట్ విషయంలో ఆశించిన మేర రాలేదనే అసంతృప్తి ఉంది. గతంలో కేంద్ర విధానాల మేరకు పదేళ్లకోసారి వేతన సవరణకు వెళ్తామన్నారు. ఉద్యోగుల నిరసనతో ప్రభుత్వం తగ్గి రాష్ట్ర పీఆర్సీ అమలు చేయడం సంతోషకరం. సీపీఎస్ రద్దుపై మార్చి 31లోగా రోడ్‌మ్యాప్ ప్రకటిస్తామన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత ఇచ్చారు" - సూర్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
ఇదీ చదవండి