జనవరి 10 లేదా 11న స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సీఎం జగన్ కేబినెట్ భేటీలో మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు డిసెంబర్ 20లోగా మార్కెట్, దేవాలయాల కమిటీల నియామకాలను పూర్తి చెయ్యాలని.. పొరుగుసేవల సంస్థ ద్వారా ఈ ప్రక్రియ సాగాలని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ నవశకం ద్వారా పథకాల లబ్ధిదారుల జాబితా డిసెంబర్‌లో కొలిక్కి వస్తుందన్న సీఎం.... ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో వారి విశ్వాసాన్ని పొందాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కిందస్థాయి నేతలతో సమావేశాలు సాగలేదని మంత్రులు చెప్పగా ... సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు.
తెలుగు తప్పనిసరి
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. అన్ని పాఠశాలల్లోనూ పిల్లలకు తెలుగు నేర్పాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ చెప్పబోయారు. ప్రైవేటు పాఠశాలల వారికి చిన్న అవకాశమిచ్చినా వాళ్లు తెలుగును తప్పించే ప్రయత్నం చేస్తారు. సెకండ్ లాగ్వేజ్ అనో ఇంకోటనో వద్దు. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు.
లైన్మెన్ నియామకాలు పారదర్శకంగా
జూనియర్ లైన్ మెన్ నియామకం విషయంలో మంత్రులకైనా.. ఇంఛార్జ్ మంత్రులకైనా బాధ్యతలు అప్పగించాలని కొందరు అమాత్యులు సీఎంను కోరారు. పార్టీ, మంత్రులు కాకుండా...పొరుగు సేవల సంస్థ ద్వారా పారదర్శకంగా చేయాలని సీఎం స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి ఉందని.....అన్ని నియామకాల్లో అవకాశం లేకపోతే ఇబ్బందిగా ఉంటోందని మంత్రులు వివరించారు. ఎక్కడా ఎలాంటి అవినీతి జరగకూడదని సీఎం జగన్ చెప్పారు. సబ్‌స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్ల నియామకాలు చేపట్టాలని మంత్రులు ఎక్కువమంది పట్టుబట్టారు. అయితే ఇప్పుడున్న వారితోనే పని చేయించగలమని...కొత్తగా నియామకాలు చేస్తే ఆర్థికభారం పెరుగుతుందని విద్యుత్‌శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రేషన్‌కార్డుల జారీకి ఆదాయ పరిమితి పెంపుపై చర్చలో మంత్రి వనిత కలగజేసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు జీతం 11వేలు పెంచాం. ఇప్పుడు వారు రేషన్‌కార్డుల పరిధిలోకి రారు. వారికి కొంత సడలింపు ఇస్తే బాగుంటుందని అన్నారు. ఇలా ఒక్కొక్కరికీ సడలింపులిస్తుంటే నియంత్రణ ఉండదని మరికొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు.